చంద్రుని ధ్రువ ప్రాంతాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి చంద్రయాన్2 లూనార్ ఆర్బిటర్ నుంచి అత్యంత ఆధునిక డేటాను సేకరించినట్టు ఇస్రో శనివారం వెల్లడించింది. చంద్రుని ధ్రువ ప్రాంతాల ఉపరితలంపైని భౌతిక, విద్యుద్వాహక ప్రమాణాల లక్షణాలను సమగ్రంగా అధ్యయనం చేయడానికి వీలవుతుందని పేర్కొంది. చంద్రునిపై భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రయోగాలకు ఈ డేటా ఉపయోగపడుతుందని వివరించింది. 2019 నుంచి చంద్రుని కక్షలో చంద్రయాన్ 2 ఆర్బిటర్ పరిభ్రమిస్తోందని, అత్యంత నాణ్యమైన డేటాను సేకరించిందని ఇస్రో పేర్కొంది. చంద్రయాన్ 2 ప్రయోగించిన దగ్గర నుంచి ఇప్పటివరకు దాదాపు 1400 రాడార్ డేటా సెట్ల సమాచారం గ్రహించడమైందని, ఉత్తర, దక్షిణ ధ్రువాల 8ం నుంచి 90 డిగ్రీల అక్షాంశాల్లో ధ్రువ మాపక నమూనా సృష్టించడానికి ఈ డేటా ఉపయోగపడుతుందని ఇస్రో వివరించింది.