కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నవీన్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం వెంగళ్ రావు నగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ఇంటింటి ప్రచారంలో మంత్రి తుమ్మలకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా జూబ్లీ హిల్స్ ఓటర్లు చారిత్రక తీర్పు ఇవ్వాలన్నారు. హైదరాబాద్ సుస్థిర అబివృద్ధి కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వంలో అవినీతి అరాచకం రాజ్యమేలాయనీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పినా, ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్ గెలిస్తే రాష్ట్రం అవినీతి అరాచక పాలనలోకి వెళ్ళే ప్రమాదం ఉందన్నారు. ప్రశాంతమైన హైదరాబాద్ కోసం బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలను తరిమి కొట్టాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. ఓటమి భయంతో బిఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుందని మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు బి
ఆర్‌ఎస్ అభ్యర్థికి వేయాలని కమ్మ సంఘాలకు తాను చెప్పినట్లు ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని మంత్రి తుమ్మల తీవ్రంగా ఖండించారు. కమ్మ సామాజిక వర్గానికి ఎవరు ఏమిటో తెలుసని, గత ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గం వారిని వేధించిన ఘటనలు మరచి పోలేదని మంత్రి స్పష్టం చేశారు. తెలుగుదేశం ఓట్ల కోసం బిఆర్‌ఎస్ ఆడుతున్న కపట నాటకాలను ఎలా తిప్పి కొట్టాలో పసుపు సైన్యానికి బాగా తెలుసన్నారు. ఆత్మ గౌరవంతో తెలుగుదేశం శ్రేణులు ఓటు వేయాలని మంత్రి తుమ్మల కోరారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అపార్ట్‌మెంట్ వాసులు విద్యావంతులు పోలింగ్ కు తరలి రావాలని, ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రజా ప్రభుత్వం కు మద్దతుగా తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బిఆర్‌ఎస్, బిజెపి ఎన్ని కుయుక్తులు చేసినా జూబ్లీ హిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైరా ఎంఎల్‌ఏ రాoదాస్ నాయక్, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.