హైదరాబాద్: ఇసిని గుప్పిట్లో ఉంచుకొని ఓట్ల అవకతవకలకు బిజెపి పాల్పడుతోందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎన్నికల సంఘాన్ని బిజెపి ప్రభావితం చేస్తోంది అని అన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఓట్ల అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే ఆధారాలతో నిరూపించారని, హరియాణాలో కాంగ్రెస్ గెలుస్తోందని ప్రజలు భావించారని తెలియజేశారు. హరియాణాలో ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా బిజెపి గెలిచింది అని హరియాణాలో 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని విమర్శించారు. హరియాణాలో ఒకే మహిళ ఫొటోతో వంద ఓట్లు ఉన్నాయని, పక్క రాష్ట్రాల్లోని వ్యక్తులను సైతం హరియాణాలో ఓటర్లుగా చేర్చారని మండిపడ్డారు.
బిహార్ లో తమకు బలం లేని చోట్ల.. ఓట్లను బిజెపి తొలగిస్తోందని, ఇసిని ఆధారాలతో సహా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే సమాధానం లేదు అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నిష్పక్ష పాతంగా వ్యవహరించాల్సిన ఇసి.. ఒకే పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఓట్ల అవకతవకలకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు దేశంలో 5 కోట్ల సంతకాలు సేకరణ జరిగిందని, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ పక్క నియోజకవర్గాల ఓటర్లను చేర్చారు అని ధ్వజమెత్తారు. బిజెపి, బిఆర్ఎస్ లోపాకారి ఒప్పందం వల్లే పక్క నియోజక వర్గాల ఓటర్లను చేర్చారని, సంతకాల సేకరణ పత్రాలను ట్రక్కుల ద్వారా తీసుకెళ్లి రాష్ట్రపతికి అందిస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.