చీఫ్ సెలెక్టర్ అగార్కర్ తీరుపై మాజీల ఆగ్రహం
ముంబై: టీమిండియా స్టార్ ఫాస్ట్ మహ్మద్ షమీపై సెలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరుపై భారత మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ షమీపై చేస్తున్న వ్యాఖ్యలను వారు తప్పుపడుతున్నారు. ఫిట్‌నెస్ లేమీతో బాధపడుతున్న జస్‌ప్రీత్ బుమ్రాను అన్ని ఫార్మాట్‌లకు ఎంపిక చేస్తున్న సెలెక్టర్లు అసాధారణ ఫిటెనెస్‌తో రంజీ ట్రోఫీతో సహా పలు దేశవాళీ క్రికెట్ టోర్నీలలో వికెట్ల పంట పండిస్తున్న షమీపై నిర్లక్షం చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. మాజీ ఆటగాళ్లు ఆకాశ్ చోప్రా, యువరాజ్ సింగ్, శ్రీకాంత్, వెంగ్‌సర్కార్, గవాస్కర్, కపిల్ దేవ్, మనోజ్ తివారీ తదితరులు అగార్కర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. అతను కావాలనే షమీని టీమిండియాకు దూరం పెడుతున్నాడనే విషయం స్పష్టమవుతుందన్నారు. క్రికెట్‌లోఇలాంటి కక్ష సాధింపు చర్యలకు తావులేదన్నారు.
ఇప్పటికైనా అగార్కర్ తన తీరును మార్చుకోవాలని వారు హితవు పలుకుతున్నారు. కొంత కా లంగా షమీ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్‌లో అద్భుత బౌలింగ్‌ను కనబరుస్తు న్న సంగతి తెలిసిందే. బెంగాల్ తరఫున రంజీ బరిలోకి దిగిన షమీ రెండు మ్యాచుల్లోనూ తన జట్టుకు ఒంటిచేత్తో విజయం సాధించి పెట్టాడు. ఇంత అద్భుత ఫామ్‌లో ఉన్న షమీని సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌కు సెలెక్టర్లు దూరంగా ఉంచారు. పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోవడం వల్లే అతన్ని సఫారీ సిరీస్‌కు ఎంపిక చేయలేదని ప్రధాన కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ పేర్కొన్నారు.
దీనిపై షమీ అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గంభీర్, అగార్కర్‌ల వల్ల సీనియర్లు చాలా అవమానాలను భరీంచాల్సి వస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వీరి అవమానాలు భరించలేక సీనియర్లు అశ్విన్, రోహిత్, కోహ్లి తదితరులు టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెం ట్ ప్రకటించిన విషయాన్ని మాజీ క్రికెటర్లు గుర్తు చేశారు. షమీ కూడా నేడో రేపో ఆటను గుడ్‌బై చెప్పినా ఆశ్చర్యం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా షమీలాంటి సీనియర్ బౌలర్లకు టీమిండియాలో చోటు కల్పించాలని ఇది జట్టుకు ఎంతో మేలు చేస్తుందని వారు సూచిస్తున్నారు.
షమీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఇప్పటికే టీమిండియాకు దూరమై బాధలో ఉన్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ షమీకి మరో షాక్ తగిలింది. షమీ మాజీ భార్య హసీన్ జహాన్‌కు సంబంధించిన కేసులో షమీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. నెలనెలా తనకు భరణం, కుమార్తె సంరక్షణ కోసం చెల్లిస్తున్న రూ.4 లక్షల భరణం సరిపోవడం లేదని హసీన్ జహాన్ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశా రు. దీనిపై సమాధానం ఇవ్వాలని షమీకి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.