మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ అభివృద్ధికి తలమానికమైన త్రిపుల్ ఆర్‌ను తానే ప్రధానమంత్రి నరేంద్రమోడీతో మాట్లాడి మంజూరు చేయించానని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశను, వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులను తాను అడ్డుకుంటున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగజారి అవాస్తవాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రానికి పట్టిన శని అని అన్నారు. తాను మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, అయితే తాను ఎక్కడ అడ్డుకున్నానో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎల్ అండ్ టీతో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒప్పందమే చేసుకోలేదని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డీపీఆర్ సిద్ధం చేయలేదని వెల్లడించారు. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులను అడ్డుకున్నానని ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి తగదని హితవు పలికారు. హైడ్రా నిజంగానే న్యాయం వైపు ఉంటే, ఆక్రమణలనే కూల్చివేస్తే ఇప్పటివరకు ఎంఐఎం కాలేజీలను ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని పునరుద్ఘాటించారు. మూసీ బాధితులకు న్యాయం చేయాలనుకుంటున్నామని కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ చెడ్డ కుటుంబాలేనని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌కి ఓటేస్తే మజ్లిస్‌కి ఓటేసినట్లే
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ, హైమావతి నగర్ చౌరస్తాలో శుక్రవారం జరిగిన బహిరంగ సభల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌కి ఓటు వేస్తే మజ్లిస్‌కి ఓటు వేసినట్లేనని అన్నారు. ఆ పార్టీ పూర్తిగా మజ్లిస్ చేతుల్లో బందీ అయిపోయిందని అన్నారు.
వాసవి బృందావనంలో రాంచందర్‌రావు ప్రచారం
జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా – వాసవి బ్రిందావనం రెసిడెన్సియల్ సొసైటీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు శుక్రవారం ప్రచారం నిర్వహించారు. తన నాయకులు, కార్యకర్తలతో కలిసి సందర్శించి అక్కడ ఉన్న ఓటర్లను కలిసి ప్రజల సమస్యలపై చర్చించారు. అక్కడ ఉన్న నివాసితులతో పాటు ఉదయం వాకింగ్ చేసే వారితో ముచ్చటిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.