“ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం కళాశాలలను మూసి వేసి ప్రభుత్వాన్నే బ్లాక్‌మెయిల్ చేస్తారా?, విద్యార్థులతో జీవితాలతో చెలగాటమాడుతారా?, వచ్చే ఏడాది డొనేషన్లు ఎలా వసూలు చేస్తారో&చూస్తా” అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల యజమాన్యాలకు వార్నింగ్ ఇచ్చారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీన్, ఎంపి అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాలల బంద్ గురించి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్దకు ఎవరెవరూ ఏమేమీ పనుల కోసం వచ్చారో, వాటిని తాను తిరస్కరించినందున బంద్‌కు పిలుపునిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఏ కళాశాల ఎంత డొనెషన్లు వసూలు చేస్తున్నదో తనకు తెలుసునని అన్నారు. విద్య వ్యాపారం కాదు, సేవగా భావించాలని ఆయన తెలిపారు. మీ వెనకాల ఎవరు ఉన్నారో తనకు తెలుసునని అన్నారు. ఆరోరా రమేష్ ఎన్ని కళాశాలలకు అనుమతి కోరారో, మహబూబ్‌నగర్‌కు చెందిన జయప్రకాష్ హైదరాబాద్‌లో క్యాంపస్ కోరారని,
వాటికి తాను సానూకలంగా స్పందించనందుకు కళాశాలలను మూసి వేయిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఫీజుల బకాయిలు ఈ రోజు కాకపోతే, రేపైనా వస్తాయన్నారు. కానీ బంద్‌తో విద్యార్థులు నష్టపోతున్నారని ఆయన అన్నారు. మీ వెనుక బిజెపి నాయకులు ఉన్నారని ఆయన విమర్శించారు. సిట్ వేసి దర్యాప్తు చేయిస్తానన్నారు. ప్రభుత్వానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నదని అన్నారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైరెన వారికి చెల్లించడం వంటివి పోగా ఐదు వేల కోట్ల రూపాయలే మిగులుతున్నాయని, ఇందులో ఆరోగ్యశ్రీ, ఆర్టీసీకి చెల్లించడం, సన్న బియ్యం, ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలకు చెల్లించాల్సి వస్తున్నదన్నారు. బిజెపి రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అమాయకంగా వీరి ఉచ్చులో వడవద్దని ఆయన సూచించారు. మంద కృష్ణ మాదిగ, ఆర్. కృష్ణయ్య ముందుకు వస్తే వారి చేతికే చిట్టా ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.