వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. గతంలో రూ.88 లక్షల ప్యాకేజీని అధిగమించి ఈసారి అత్యధికమైన రూ.1.27 కోట్లు దేశీయ ప్యాకేజీ ఆఫర్ లభించింది. ప్లేస్‌మెంట్ సీజన్ 2025-=26 ప్రారంభ దశలోనే వచ్చిన అద్భుత ఫలితాలు సంస్థ బలమైన విద్యా పునాది, పరిశ్రమలతో ఉన్న సన్నిహిత బంధాలు, విద్యార్థుల అసాధారణ ప్రతిభను ప్రతిబింబిస్తున్నాయి. నిట్ చరిత్రలో అత్యధిక దేశీయ ఆఫర్ రూ.1.27 కోట్ల జాబ్ ఆఫర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాకి చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన బిటెక్ విద్యార్థి నారాయణ త్యాగి దక్కించుకున్నాడు. బహుళజాతి కంపెనీ నుంచి రూ.1.27 కోట్ల సిటిసితో ఈ దేశీయ ఆఫర్‌ను పొందాడు. ఇది వరంగల్ నిట్ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ప్యాకేజీ.
అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థి మొహమ్మద్ నహిల్ నష్వాన్ రూ.1 కోటి సిటిసితో దేశీయ ఆఫర్‌ను పొందారు. ఈ ఘనతతో సదరు విద్యార్థులు వరంగల్ నిట్‌ను దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటిగా నిలబెట్టారని, అంతర్జాతీయ ప్రమాణాల విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు మరోసారి నిరూపించాయని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి వ్యాఖ్యానించారు. 2025=-26 ప్లేస్మెంట్ డ్రైవ్ ప్రారంభమైన రెండు నెలల వ్యవధిలోనే విభిన్న శాఖల విద్యార్థులు అత్యుత్తమ అవకాశాలను సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ప్లేస్‌మెంట్ సీజన్ తొలి రెండు నెలల్లో రూ.70 లక్షలకు పైగా సిటిసితో ఆరుగురు విద్యార్థులు ఆఫర్లు పొందారని, రూ.50 లక్షలకుపైగా సిటిసితో 34 మంది, రూ.30 లక్షలకుపైగా సిటిసితో 125 మంది, రూ.25 లక్షలకుపైగా సిటిసితో 163 మంది, రూ.20 లక్షలకుపైగా సిటిసితో 200 మందికి పైగా విద్యార్థులు ఆఫర్లు పొందారని తెలిపారు.
అక్టోబర్ 15 వరకు సగటు ప్యాకేజీ రూ.26 లక్షలను దాటిందని చెప్పారు. ప్లేస్‌మెంట్ సీజన్ ఇంకా కొనసాగుతూనే ఉందని, ఇంకా చాలామంది ప్రతిభావంతులైన విద్యార్థులు అవకాశాల కోసం అందుబాటులో ఉన్నారని అన్నారు. అనేక ప్రముఖ సంస్థలు తమ క్యాంపస్ సందర్శనకు సిద్ధంగా ఉన్నాయని, రాబోయే నెలల్లో మరిన్ని అధిక విలువ గల ఆఫర్లు వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు. కాగా, అత్యధిక ప్యాకేజీలు పొందిన విద్యార్థులందరికీ, అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ప్లేస్మెంట్ సీజన్ విద్యార్థుల ప్రతిభ, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు, సంస్థపై రిక్రూటర్ల నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోందని అన్నారు. ఈ విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించిన సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ (సిసిపిడి) బృందానికి, హెడ్ ప్రొఫెసర్ పి.వి.సురేష్‌కు నిట్ డైరెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.