రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజును రాష్ట్ర ఫిషరీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ వినూత్నంగా ఏర్పాటు చేశారు. నేటితో (శనివారం) 57 ఏళ్ల వయస్సులోకి అడుగుపెడుతున్న సిఎం రేవంత్‌కు 57 కిలోల సన్నబియ్యంతో అతని చిత్రపటాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ పేదల పెన్నిధిగా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డి పేదల కోసం సన్నబియ్యం పథకాన్ని అమల్లోకి తీసుకు వచ్చారన్నారు. ధనిక, బీద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సన్న బియ్యం తినాలని సంకల్పించిన సిఎంను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలన్నారు. సిఎం బర్త్ డే రాష్ట్ర ప్రజలకు ఎల్లకాలం గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలన్న తలంపుతో పుట్టినరోజు కానుకగా సన్న బియ్యంతో సిఎం చిత్రపటాన్ని తయారు చేయించానని మెట్టు సాయికుమార్ పేర్కొన్నారు. సన్నబియ్యం పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేయనుంది.