హైదరాబాద్: తమ ఆలోచనలను ప్రజల ముందు ఉంచామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం నిర్వహించిందని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ..2004-2014 మధ్య కాలంలోనే హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ధి చెందిందని తెలియజేశారు. ఒఆర్ఆర్, శంషాబాద్ విమానాశ్రయం, మెట్రో ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చిందని, 2014 నుంచి హైదరాబాద్ లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. 2014 నుంచి కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని బిఆర్ఎస్ రాష్ట్రానికి చేసింది శూన్యం అని విమర్శించారు. 2014 లో రూ. 16 కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, 2023లో మాజీ సిఎం కెసిఆర్ తెలంగాణను రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో పెట్టి మళ్లీ కాంగ్రెస్ కు అప్పగించారని మండిపడ్డారు. హైదరాబాద్ కు యూపిఎ ప్రభుత్వం ఇచ్చిన ఐటిఐఆర్ ను రద్దు చేసింది ఎవరు? అని ప్రశ్నించారు. ఐటిఐఆర్ కూడా మంజూరు చేసి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది ఉండేదని రేవంత్ పేర్కొన్నారు.
వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోతే కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేంద్రం నుంచి వరదసాయంగా రూపాయి కూడా తేలేదని ధ్వజమెత్తారు. ఎవరికీ అనుమతి లేని విలాసవంతమైన భవనాలు మాత్రమే కెసిఆర్ నిర్మించారని, వాస్తు సరిగా లేదని.. బాగున్న సచివాలయాన్ని కూల్చి కొత్తది నిర్మించారని ఎద్దేవా చేశారు. కొత్త సచివాలయం నిర్మించడం వల్ల ఎవరికైనా కొత్తగా ఉద్యోగాలు వచ్చాయా?అని నిలదీశారు. ప్రతి పక్ష నేతల మీద, పాత్రికేయుల మీద నిఘా పెట్టేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారని, రైతుల కోసమని కట్టిన కాళేశ్వరం మాత్రం మూడేళ్లకే కూలిందని విమర్శించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలన, పదేళ్ల బిఆర్ఎస్- బిజెపి పాలనను ప్రజలు పోల్చి చూడాలని, ఎవరి హయాంలో రాష్ట్రానికి ఏమి వచ్చిందో ప్రజలు గమనించాలని సూచించారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కొనియాడారు.
అప్పటికే మంజూరైన ఐటిఐఆర్ వంటి సంస్థలను కూడా బిజెపి రద్దు చేసిందని, గోదావరి జలాల ఫేజ్-1 ఫేజ్-2 లను నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. పదేళ్లలో మెట్రో రైలును కొత్తగా కిలో మీటరు కూడా పొడిగించలేదని, మంజూరైన పాతబస్తీ మెట్రోను కూడా పక్కకు పెట్టారని, మెట్రోను నిర్మించిన ఎల్ అండ్ టి నష్టాలకు కూడా బిఆర్ఎస్ కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ అండ్ టి సంస్థలను బెదిరించి డబ్బు వసూలు చేసింది బిఆర్ఎస్ నేతలని, బిఆర్ఎస్ దిగిపోతూ కూడా ఒఆర్ఆర్ ను అమ్ముకున్నదని అన్నారు. లక్షల కోట్లు ఆదాయం వచ్చే ఒఆర్ఆర్ ను కేవలం రూ. 7 వేల కోట్లు అమ్ముకున్నది బిఆర్ఎస్ అని హైదరాబాద్ అభివృద్ధికని బ్యాడ్ బ్రదర్స్ కిషన్ రెడ్డి, కెటిఆర్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రూ. 5 వేల కోట్లతో సికింద్రాబాద్ నుంచి ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టామని రేవంత్ స్పష్టం చేశారు.