టీం ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి ఆయన మాజీ భార్య హసీన్ జహాన్ మరోసారి షాక్ ఇచ్చింది. నెలనెలా తనకు చెల్లించే భరణం సరిపోవడం లేదని ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీం కోర్టు దీనిపై సమాధానం ఇవ్వాలని షమీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హసీన్ కోసం నెలకు రూ.1.5 లక్షలు, కుమార్తె సంరక్షణ కోసం నెలకు రూ.2.5 లక్షలు చెల్లించాలని కోల్‌కతా హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఈ రూ.4 లక్షలు కూడా సరిపోవడం లేదని హసీన్ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
ఆమె పిటీషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు షమీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నాలుగు వారాల్లో స్పందించాలని కోరింది. ఈ గడువు ముగిసిన అనంతరం ఈ కేసు విచారణకు రానుంది. షమీ, హసీన్‌లకు 2014లో వివాహం కాగా.. 2015లో ఐరా జన్మించింది. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. 2018లో హసీన్.. షమీపై గృహహింస ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించింది. 2023లో జిల్లా సెషన్సు కోర్టు హసీన్‌కు నెలకు రూ.50 వేలు, ఐరాకు రూ.80 వేలు చొప్పున ఇవ్వాలని ఆదేశించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ హసీన్ కోల్‌కతా హైకోర్టును అశ్రయించింది. దీంతో ఆ మొత్తాన్ని రూ.4 లక్షలకు పెంచింది. ఇప్పుడు ఆ డబ్బు కూడా సరిపోవడం లేదని ఆమె సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.