మన తెలంగాణ / రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం హైదరాబాద్ – బెంగుళూరు జాతీయ రహదారి పై ఆరాంఘర్ కూడలి వద్ద ఆర్టీసీ బస్సును అదుపు తప్పి డిసిఎం వ్యాన్ ఢీకొట్టింది. ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో బస్సులోని ప్రయాణీకులు హహాకారాలు చేశారు. స్థానికుల కథనం ప్రకారం… షాద్ నగర్ డిపోకు చెందిన టిఎస్07యుఎం-0713 నంబరు గల బస్సు ప్రయాణీకులతో ఆరాంఘర్ కు వచ్చింది. ఆరాంఘర్ ఆగిన బస్సు ను ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గ్రీన్ పడడంతో డ్రైవర్ ముందుకు నడిపాడు. అదే సమయంలో వెనుక వైపు నుంచి వేగంగా దూసుకువచ్చిన కెఎ29సి-2138 నంబరు గల డిసిఎం లారీ అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది. బస్సు వేగంగా లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఒక్కసారిగా జరిగిన సంఘటనలో ప్రయాణీకులు హహాకారాలు చేశారు. అది గమనించిన స్థానికులు ప్రయాణీకులను రక్షితంగా కిందకు దింపారు. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.