రాయ్‌పూర్: అదృశ్యమైన కుమారుడు అంత్యక్రియులు చేసిన మూడు రోజుల తరువాత రావడంతో కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాస్ట్రం సూరజ్‌పుర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందర్‌పుర్ గ్రామంలో పురుషోత్తమ్(25) అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. పురుషోత్తమ్ రెండు రోజుల నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మన్‌పుర ప్రాంతంలో ఓ బావిలో మృతదేహం కనిపించడంతో పోలీసులు పురుషోత్తమ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహం తమ కుమారుడిదేనని చెప్పడంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. అంబికాపుర్‌లో పురుషోత్తమ్‌ను అతడి బంధువులు గమనించి పట్టుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు అంబికాపుర్ వెళ్లి తన కుమారుడిని ఇంటికి తీసుకొచ్చారు. వీరు అంత్యక్రియలు జరిపిన మృతదేహం ఎవరిదై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.