న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ ట్రోఫీ సాధించి చరిత్ర సృష్టించిన టీమిండియా మహిళా క్రికెట్ టీమ్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మర్యాద పూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మహిళా క్రికెటర్లకు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో క్రికెటర్లతో ప్రధాని వివిధ విషయాలపై సరదాగా సంభాషించారు. దీనికి సంబంధించిన విశేషాలను ప్రధాని తన సోషల్ మీడియా ఖాతాలోపోస్ట్ చేశారు. ఇవి వైరల్‌గా మారాయి. తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని వరల్డ్‌కప్ విజేతగా నిలిచిన జట్టులోని ప్రతి క్రికెటర్‌తో ప్రత్యేకంగా సంభాషించారు. ఈ క్రమంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్ తదితరులతో ప్రధాని సంభాషణలు వైరల్‌గా మారాయి. కెప్టెన్ హర్మన్‌తో ముచ్చటించిన ఆమె బంతిని జేబులో వేసుకోవడం గురించి అడిగారు. దీనిపై స్పందించిన హర్మన్ అదృష్టవశాత్తూ బంతి తన దగ్గరకు వచ్చిందని, దాన్ని తానే దగ్గర పెట్టుకున్నానని సరదాగా చెప్పింది.
సర్, మీ స్కిన్ కేర్ రహాస్యం.. ప్రధానీతో హర్లీన్
భేటీ సందర్భంగా టీమిండియా స్టార్ క్రికెటర్ హర్లీన్ డియోల్ ప్రధాని మోడీని అడిగిన ఓ ప్రశ్న అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎవరూ ఊహించని విధంగా హర్లీన్ ప్రధానినిఅనూహ్య ప్రశ్నను అడిగింది. మైక్ అందుకున్న డియోల్ ‘సర్, మీ స్కిన్ కేర్ ఎప్పుడూ మెరుస్తూనే ఉంటుంది. దీని వెనక ఉన్న రహస్యమెంటో మాకు చెప్పగలరా?’ అని ప్రశ్నించింది. హర్లీన్ నుంచి ఊహించని ప్రశ్నకు ప్రధానితో సహా అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. ప్రధాని దీనిపై చిరనవ్వుతో స్పందిస్తూ వాటి గురించి ఆలోచించను అంటూ సమధానం ఇచ్చారు. ఆ వెంటనే జట్టు సభ్యుల్లోని ఒక ప్లేయర్ స్పందిస్తూ ‘సర్, ఇది దేశంలోని కోట్లాది మంది ప్రేమ వల్లే’ అనగానే మరోసారి అందరూ సరదాగా నవ్వేశారు. ఈ క్రమంలో టీమిండియా ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ స్పందిస్తూ చూశారా సర్ ఇలాంటి వారిని నేను డీల్ చేయాల్సి వచ్చిందన్నారు. అందుకే, నా జుట్టు త్వరగా తెల్లబడిపోయిందని అనేశారు.
దీప్తితో టాటూ గురించి..
భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ వేయించుకున్న హనుమాన్ టాటూ గురించి ప్రధాని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ‘హనుమంతుడి టాటూ ఉంది, అది ఎలా సాయపడింది?’అని ప్రధాని దీప్తిని ప్రశ్నించారు. దీనిపై దీప్తి స్పందిస్తూ నాకు హనుమంతుడంటే చాలా ఇష్టం, నును ఎక్కువగా నమ్మతా, నా ఆటతీరు మెరుగుకావడానికి ఇది సాయపడిందని వివరించింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో అజేయ శతకంతో భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన జెమీమా రోడ్రిగ్స్‌తో కూడా ప్రధాని సంభాషించారు. మ్యాచ్ సమయంలో జెమీమా భావోద్వేగానికి గురైన అంశంగా గురించి ప్రధాని అడిగారు. దీనిపై జెమీ స్పందిస్తూ అది సెమీ ఫైనల్ మ్యాచ్, గతంలో తాము చాలా సార్లు ఆస్ట్రేలియాపై విజయానికి చేరువగా వచ్చి పరాజయం పాలయ్యాం. ఈసారి మాత్రం తాను ఎలాగైనా చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించాలనే లక్షంతో బరిలోకి దిగా. లక్షం నెరవేరడంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యానని వివరించింది.
ప్రతీక రావల్‌కు స్నాక్స్ అందించిన ప్రధాని
క్రికెటర్ల విందు సమయంలో ప్రధాని మోడీ టీమిండియా స్టార్ ఓపెనర్ ప్రతీక రావల్‌కు ప్రత్యేకంగా స్నాక్స్ అందించడం వైరల్‌గా మారింది. ప్రధానితో భేటీకి ప్రతీక వీల్‌చెయిర్‌లో వచ్చిన విషయం తెలిసిందే. సంభాషణ అనంతరం క్రికెటర్లు స్నాక్స్ తింటుండగా.. ప్రతీక దాన్ని తీసుకునేందుకు ఇబ్బంది పడింది. ఈ విషయాన్ని గమనించిన ప్రధాని స్వయంగా స్నాక్స్‌ను తీసుకొని వెళ్లి ప్రతీకకు అందించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రధాని నిరాడంబరతను నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇలా ప్రతి క్రికెటర్‌తో మోడీ ఎంతో సరదాగా గడిపారు.