హర్యానాలో 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు 25 లక్షల నకిలీ ఓటర్లను జాబితాలో చేర్చారని లోక్‌సభ విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ బయటపెట్టడం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంలోని ఓటర్ల జాబితాలన్నీ డూప్లికేట్, నకిలీ, మృతులైన ఓటర్లతో నిండి ఉన్నాయని ఆయన ఆరోపించారు. నకిలీ ఓటర్లను ఎలా జాబితాలో చేర్చగలరో కూడా ఆయన వెల్లడించారు. కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో అర్హులైన 6000 మంది ఓటర్లను జాబితా నుంచి ఎలా తొలగించారో గత సెప్టెంబర్ 18న కూడా రాహుల్ లొసుగులు బయటపెట్టడం సంచలనం కలిగించింది. ఓటరుగా ఎవరైనా నమోదు అయితే ఆ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు మరెవరైనా తమ నంబరు ఉపయోగించి అసలు వ్యక్తికి తెలియకుండా ఫారం 8 ఉపయోగించి మార్చివేయవచ్చు. ఇవన్నీ విపక్షనేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 18న బయటపెట్టిన ఐదురోజుల తరువాత ఎన్నికల కమిషన్ రాహుల్ ఆరోపణలన్నీ తోసిపుచ్చింది. ఆధార్ అనుసంధానిత మొబైల్ నంబరును చాటుమాటుగా ఉపయోగించకుండా మార్చింది.
ఇది స్వాగతించవలసిన చర్యే అయినప్పటికీ, ఎలాంటి పత్రికా ప్రకటన లేదా చర్చ లేకుండానే జరిగింది. అంటే ఓటర్ జాబితాల నిర్వహణలో ఉన్న విపరీతమైన లోపాలను ఎన్నికల కమిషన్ స్పష్టంగా, అవ్యక్తంగా అంగీకరించినట్టే అయింది. ఈ లోపాలే ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ఆస్కారం కలిగిస్తున్నాయి. ప్రత్యేక ఓటరు గుర్తింపు నంబర్లు లోపించడం ఓటరు వివరాలను ఎవరైనా మార్చివేయడానికి వీలవుతుంది. ఇలాంటి ప్రాథమిక వ్యవస్థాపరమైన లోపాలను డేటాబేస్‌లో కనీస జ్ఞానం లేని టీనేజి ఇంజినీర్లు ఎవరూ చేయలేరు. దీనిబట్టి డేటాబేస్ నిర్వహణలో ఎన్నికల కమిషన్ ఘోరమైన అసమర్థతలో ఉందని స్పష్టమవుతోంది. ముఖ్యమైన డేటాబేస్‌తో ఉండాల్సిన ఓటరు జాబితాలు ఈ విధంగా ఉండడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. దేశం లోని ఓటరు జాబితాలు అత్యంత సమర్థులైన నిపుణులు, ప్రక్రియలతో ప్రక్షాళన, నిర్వహణ కావలసిన అవసరం ఉందని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో దేశం లోని రాష్ట్రాల్లో ఓటరు జాబితాలను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి, లోపరహితం కావడానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)ను చేపట్టడానికి సిద్ధం కావడం స్వాగతించవలసిందే. కానీ మొదటి సారి గందరగోళ పర్చిన అదే అధికారులకు, అదే ప్రక్రియ కింద ఈ బృహత్తర బాధ్యతలను అప్పగించవచ్చా? చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశాల్లో పక్షపాత వైఖరి బట్టబయలవుతోంది.
ఈ పరిస్థితుల్లో నమ్మకం, సమర్థత లోపించిన ఎన్నికల కమిషన్ తన స్వంత ప్రక్రియలు, నిబంధనలతో దేశమంతా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)ను నిర్వహించడానికి ముందుకు రావడం చర్చనీయాంశమవుతోంది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌కు ప్రత్యామ్నాయం ఈ జాబితాల ప్రక్షాళన ప్రతి అంశం లోనూ అన్ని రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయడం తప్పనిసరి. అంతేతప్ప ఆదేశాలు, ఉత్తర్వులు జారీ చేయడం సరికాదు. మొదటిది బీహార్ మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టకూడదు. అక్కడ అక్రమ వలసదారులను తొలగిస్తున్నామని తప్పుడు కారణాలు చూపించి అసలైన ఓటర్లను దురుద్దేశంతో జాబితాల నుంచి తొలగించేశారు. రెండో ముఖ్య అంశం ఓటరు జాబితా ఎలాంటి లోపం లేకుండా స్వచ్ఛంగా నిర్ధారించడానికి ఆధార్ కార్డు అన్నది ప్రాథమికం, మౌలికం.
కానీ ఆధార్ కార్డును ఉపయోగించడంపై ఎన్నికల కమిషన్ గందరగోళాన్ని సృష్టించింది. పౌరసత్వానికి ఇది రుజువు కాదని వాదించి ఆధార్ కార్డును ఆధారం లేకుండా పక్కన పెట్టేసింది. ఇది నిజం. ఆధార్ కార్డు ఉన్న ప్రతివారూ ఓటరు కావలసిన అవసరం లేదు. కానీ ప్రతి ఓటరు తప్పనిసరిగా ఆధార్ కార్డున్న వారే అన్నది వాస్తవం. ఆధార్ లింకు కలిగిన నకలు ఓటరు జాబితా లోంచి డూప్లికేట్లను, నకిలీలను, మృతులను సమర్ధంగా తొలగించివేయవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి డూప్లికేట్లు, నకిలీలు, ఇతర లోపాలను సవరించవచ్చు. ఈ ప్రక్రియతో ప్రతి ఓటరుకు ఓటరు గుర్తింపు కార్డు ఇవ్వవచ్చు. దీన్ని ఎవరూ మార్చలేరు. కానీ ఈ ప్రక్రియ ఏదీ చేయకుండా ఎన్నికల కమిషన్ అసలైన ఓటర్ల పేర్లను బీహార్‌లో కొన్ని లక్షల వరకు తొలగించి వేసింది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ తనకుతాను సాంకేతికంగా తనకేమీ పరిజ్ఞానం లేదని నిరూపించుకోవడమే కాక, ఇష్టానుసారం దుర్మార్గంగా వ్యవహరించింది.
మూడవ అంశం.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకుని వారంతట వారే సమర్పించాలని లేదా కేంద్రాల్లో వాటిని స్వీకరించడం సరైన పనికాదు. ఇంటింటికీ వెళ్లి అసలైన ఓటర్లను తనిఖీ చేసి, ధ్రువపత్రాల ఆధారంగా నమోదు చేయాలి. ఎన్నికల కమిషన్ తమ వద్దకు ఓటర్లను రమ్మన కూడదు. ఓటర్ల వద్దకే ఎన్నికల అధికారులు వెళ్లి వివరాలు నమోదు చేయాలి. కానీ బీహార్‌లో ఇదేమీ జరగలేదు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. తెలంగాణలో జనాభా గణన అధికారులు రెండు నెలల వ్యవధిలో ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి 3.5 కోట్ల మంది జనాభా వివరాలను పూర్తిగా సేకరించగలిగారు. ఎన్నికల కమిషన్ కూడా ఇలాంటి ఆదర్శనీయమైన పద్ధతి అనుసరించడం ఏకైక మార్గం. బీహార్‌లో నెల రెండు నెలల వ్యవధిలో హడావిడిగా చేసినట్టు కాకుండా నిదానంగా సక్రమ పద్ధతిలో చేస్తున్నారన్న నమ్మకం ఎన్నికల కమిషన్‌పై కలుగుతుంది.