మన తెలంగాణ/హైదరాబాద్: అన్ని విద్యాసంస్థల్లో శుక్రవారం(నవంబర్ 7) ఉదయం 10 గంటలకు వందేమాతర గీతం సామూహికంగా ఆలపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రచయిత బంకింఛంద్ర చట్టర్జీ వందేమాతరం గీతం రచించి 150వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలని కేంద్రం చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పాఠశాలలతో పాటు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా వందేమాతరం పాడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
నేడు ఢిల్లీలో ప్రారంభించనున్న మోడీ
స్వాతంత్య్ర పోరాటానికి దేశభక్తిని ప్రేరేపించిన ‘వందేమాతరం’జాతీయ గీతాన్ని రచయిత బకించంద్రఛటర్జీ రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడుగునా స్మారక ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఈ ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా స్మారక తపాలా స్టాంప్, నాణేన్ని కూడా విడుదల చేస్తారు. ఈ ఏడవ తేదీ నుంచి వచ్చే ఏడాది నవంబర్ 7 వరకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి అనుసంధానంగా అనేక చోట్ల బహిరంగ ప్రదేశాల్లో సామూహిక గీతాలాపన నిర్వహిస్తారు.