న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ ట్రోఫీతో చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ టీమ్ సభ్యులు గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలిసారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన టీమిండియా బృందం రాష్ట్రపతితో సరదాగా ముచ్చటించారు. ప్రతిష్టాత్మకమైన ట్రోఫీతో నయా చరిత్ర సృష్టించిన టీమిండియా క్రికెటర్లను రాష్ట్రపతి ముర్మ అభినందించారు. దేశంలోని కోట్లాది మంది యువతకు మీరు రోల్ మోడల్‌గా నిలిచారని కొనియాడారు.
చిరస్మరణీయ విజయంతో భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటారని ప్రశంసించారు. ఈ గెలుపు భారత మహిళా క్రికెట్‌ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లుందని విశ్వసిస్తున్నా, క్రికెట్ ప్రయాణంలో మీరు ఎన్నో కఠిన సవాళ్లను, పరీక్షలను ఎదుర్కొని ఉంటారు. అవన్నీ దాటుకుని ప్రస్తుతం విశ్వవిజేతగా నిలువడం ఆనందంగా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. మీరు సాధించిన ఈ విజయం కోట్లాది మంది భారతీయులను ఆనందంలో ముంచెత్తింది.
ఈ విజయంపై దేశ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. విశ్వవిజేతగా నిలిచిన జట్టు భారత వైవిద్యతలను ప్రతిబింబిస్తోంది. విభిన్న ప్రాంతాలు..భిన్న పరిస్థితులు, విభిన్న సామాజిక నేపథ్యాలు ఉన్న వారంతా ఒక జట్టుగా సమష్టి విజయం సాధించడం గర్వంగా ఉందన్నారు. రాబోయే తరాలకు మీరంతా స్పూర్తిదాయకంగా నిలిచారని రాష్ట్రపతి కొనియాడారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులంతా సంతకాలు చేసిన ప్రత్యేక జెర్సీని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బహూకరించారు.