ఓటమి భయంతోనే బిఆర్‌ఎస్ నేతల దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఆ పార్టీ నేతలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ లోని మూసాపేటలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్థిరపడ్డ కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రజల అకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని,
అధికారంలోకి వచ్చిన రేండేళ్లలోనే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేశారన్నారు.ఉమ్మడి పాలనలో ఏ ముఖ్యమంత్రి చేయని అప్పులు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చేశారని, ఆయన చేసిన రూ. 8 లక్షల కోట్ల అప్పులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదికి రూ. 75 కోట్ల వడ్డీలు చెల్లిస్తుందన్నారు.సిఎం రేవంత్ రెడ్డిపై కెటిఆర్ వ్యాఖ్యలు బావదారిద్య్రం, దివాలాకోరుతనాన్ని చాటుతున్నాయని మంత్రి జూపల్లి మండిపడ్డారు. కెసిఆర్ కుటుంబం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆరాచక పాలన చేసిన కెసిఆర్ కుటుంబానికి ఓటు అడిగే హక్కు లేదని ఆయన పేర్కొన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు ఓటు వేయడమే కాకుండా ఇంటింటికి తిరుగుతూ నవీన్ యాదవ్‌కు మద్దతుగా నిలబడి ఓట్లు వేయించాలని ఆయన కోరారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమైందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందని మంత్రి జూపల్లి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.