న్యూఢిల్లీ: ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేేసులో టీమిండియా మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బిగ్ షాకిచ్చింది. అక్రమ బెట్టింగ్ కార్యక్రమాలపై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఇద్దరు క్రికెటర్లకు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. అటాచ్‌మెంట్‌లలో ధావన్ కు చెందిన రూ.4.5 కోట్ల విలువైన స్థిరాస్తి, రైనాకు చెందిన రూ.6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఉన్నాయి.
కాగా, ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల అనుబంధ బ్రాండ్‌లతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న విదేశీ సంస్థలతో ఇద్దరు ఆటగాళ్లు తెలిసి ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు కుదుర్చుకున్నారని దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ధావన్, రైనాను ఈడీ అధికారులు విచారించింది. క్రికెటర్లతోపాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ యాక్టర్లను కూడా ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.