ఈసారి 121 స్థానాలలో ఓటు
ఎన్‌డిఎ, ఇండియా కూటమి హోరాహోరీ
గంగా దక్షిణ ప్రాంతపు 18 జిల్లాల్లో బ్యాలెట్
సిఎం అభ్యర్థి తేజస్వీకి కీలక పరీక్ష
పాట్నా: ఎన్‌డిఎ, ఇండియా కూటమి మహాఘట్‌బంధన్ నడుమ తీవ్ర ఉత్కంఠతను రేపే బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ నేడు ( గురువారం) జరుగుతుంది. ఈ తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాలలో అర్హులైన ఓటర్లు తమ ప్రజాస్వామిక హక్కు వినియోగించుకోనున్నారు. ఈ దఫా గంగా దక్షిణ ప్రాంతంలో విస్తరించుకుని ఉండే ఈ పోలింగ్‌లో ఇంతకు ముందటి ఫలితాల క్రమంలో మహాఘట్‌బంధన్‌కు ఆధిక్యత అవకాశం ఉంది. అయితే ఈసారి ఇక్కడ ఎన్‌డిఎ అతిరధ మహారధులు ప్రత్యేకించి మోడీ, అమిత్ షాలు తమ దృష్టిని కేంద్రీకరించారు. దీనితో ఓటు ఫలితం ఎటువైపు అనేది తేలాల్సి ఉంది. ఇక్కడ పలు రాజకీలక సమీకరణలు, సామాజిక పరిస్థితులు గెలుపోటములను ఖరారు చేస్తాయి.
ఈ ప్రాంతంలో గత అసెంబ్లీ ఎన్నికలలో ఆర్జేడీ, కాంగ్రెస్ ఇతర పార్టీల కలయిక అయిన మహాఘట్‌బంధన్ మొత్తం 121 స్థానాలకు 63 గెల్చుకుని తిరుగులేదన్పించుకుంది. ఇప్పుడు ఇండియా కూటమి గా సాగుతోన్న పోరులో జయాపజయాలు ఇండియా కూటమి ఉనికికి , బలోపేతానికి అగ్నిపరీక్ష కానున్నాయి. ఈ ప్రాంతంలో ఇంతకు ముందు బిజెపి, జెడియుల ఎన్‌డిఎ 55 స్థానాల్లో గెలిచింది. ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రచార సభలలో ప్రధాని మోడీ తన వెంట జెడియు నేత లలన్ సింగ్ ఉండగా బీహారీల ఓట్ల కోసం అభ్యర్థించారు. నితీశ్‌కుమార్ ఎక్కువగా సభలకు రాలేదు. దీని ప్రభావం ఏమిటనేది ఈ విడత పోలింగ్‌తో తెలుస్తుంది. ఇండియా కూటమి తరఫున స్థానిక ప్రజలను ఆకట్టుకునేందుకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇమేజ్ కీలకం కానుంది.
ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీహార్‌లో ఓటు చోరీ నిరసన యాత్ర సాగించడం, జాలర్లతో కలిసి ఈత కొట్టడం, ఇతర ప్రజాకర్షక పద్థతులకు దిగడం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఓటు ఫలం ఎటు అనేది తేలాల్సి ఉంటుంది. అయితే ప్రచార దశలో ఆయన ఎక్కువగా పాల్గొనలేదు. కొంత కాలం అమెరికా ఇతర దేశాల పర్యటనలోనే గడిపారు. రాష్ట్రంలో రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన సురాజ్ పార్టీ కూడా ఈ సారి రంగంలోకి దిగింది. ఆయన పోటీ చేయడం లేదు. అయితే తమ పార్టీ ఈ ఎన్నికలలో గణనీయ శక్తి అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలలో హైదరాబాద్ ఎంపి , మజ్లిస్ నేత అసదుద్దిన్ తమ పార్టీ తరఫున అభ్యర్థులను దింపారు. ఇవి ఇండియా కూటమి ఓట్లను చీలుస్తాయనే ఆందోళన సంబంధిత పార్టీల నేతలలో ఉంది. ఈసారి పోలింగ్‌లో నితీశ్ కుమార్ కేబినెట్‌లోని 16 మంది మంత్రుల భవితవ్యం తేలాల్సి ఉంది. ప్రత్యేకించి రాఘోపూర్,మహూవా , ఛాప్రాల్లో పోటీ నువ్వానేనాగా ఉంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలలో ఇప్పుడు జరిగే తొలి విడత పోలింగ్ 18 జిల్లాలకు విస్తరించుకుని ఉంది.
ఈసారి పోలింగ్‌లో తేజస్వీ యాదవ్ , సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్, ఉప ముఖ్యమంత్రి, బిజెపి నేత సామ్రాట్ చౌదరి, గాయకులు మైధిలీ ఠాకూర్ వంటి వారు ప్రముఖులుగా ఉన్నారు. ఇండియా కూటమి తరఫు సిఎం అభ్యర్థి తేజస్వీ రఘోపూర్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. పాట్నా సాహిబూ, బెగూసరాయ్. ఛాప్రా వంటి స్థానాలు ప్రధాన పోటీ కేంద్రాలు అయ్యాయి.