వలసలపై అమెరికాలో ఇప్పుడు కొనసాగుతున్న వ్యతిరేకత చాలా చిత్రమైనది. నిజానికి వలసలపై వారి వైఖరి, ధోరణిపై అర్థమే లేదు. అమెరికన్లు అంతా ఇలాగే లేరు కాని, ప్రస్తుతం ఈ ధోరణిదే ఆధిపత్యం. వలసలపై మాట్లాడే చర్చించే నైతిక అర్హతలు ప్రస్తుతం అమెరికన్లుగా చలామణి అవుతున్న వారికి కనీస మాత్రంగా కూడా లేవు. చదువు, బతుకు దెరువు కోసం ఇతర దేశాలనుంచి అమెరికాకు వలస వచ్చిన విద్యార్థులు, యువతపై తీవ్రమైన వ్యతిరేకత, కోపం, ద్వేషం వ్యక్తం కావడం చాలా చిత్రమైన సంగతి. ఆశ్చర్యకరంగా ఇప్పుడు అధికారంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ దొరవారు ఈ నినాదంపైనే గద్దెనెక్కారు. ఆయనతో సహా వలసలను వ్యతిరేకిస్తున్న వాళ్లు తన మూలాలు ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే వారి నోరు పెగిలే అవకాశం ఏమాత్రం లేదు. గొంతులో పచ్చి వెలక్కాయ పడిపోయి ఒక్కరికి కూడా మాటపెగలదు. 90 శాతానికి పైగా ప్రస్తుత అమెరికన్ పౌరుల మూలాలు అమెరికా భూభాగం వెలుపలివే. వీరెవ్వరు కూడా అమెరికా భూమి పుత్రులు ఎంత మాత్రంకారు. ఎక్కువగా యూరోపియన్ దేశాలకు చెందిన వీళ్ళ తాతలు, ముత్తాతలు ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ లాంటి యూరప్ దేశాలకు చెందిన వారు.
దాదాపుగా వీళ్లంతా తెల్లతోలు కలిగిన ప్రజలే. ఆఫ్రికా నుంచి వచ్చిన నల్లతోలు ప్రజలు వారంతట వారుగా అమెరికాకు వచ్చిన వారు కాదు. బలవంతంగా తీసుకు రాబడిన వారే ఇప్పటి అమెరికన్ నల్లజాతీయులు. యూరప్ నుంచి అమెరికాకు వలస వచ్చిన తెల్లతోలు యూరోపియన్లు తమ వ్యక్తిగత సేవలు, ఆక్రమించిన వ్యవసాయ భూముల్లో వెట్టి కూలీలుగా పని చేయడానికి ఆఫ్రికా నుంచి బలవంతంగా బానిసలుగా తరలించబడిన వారే నల్లజాతీయులు. అసలైన భూమి పుత్రులు, నిజమైన అమెరికన్లు కేవలం రెడ్ ఇండియన్ల మాత్రమే. స్థానికులు, భూమి పుత్రులు అయిన ఈ రెడ్ ఇండియన్లు ఇప్పుడు అమెరికాలో కడు దయనీయ జీవితాలను వెళ్ల బుచ్చుతున్నారు. కేవలం కూలీలుగా, నాల్గవ తరగతి ఉద్యోగులుగా మాత్రమే వీళ్లు బతుకులను వెళ్లదీస్తున్నారు. వారి భూములు, అడవులను ఆక్రమించిన తెల్లతోలు యూరోపియన్లు మాత్రం ఆధిపత్యం చేస్తూ అమెరికన్లుగా చలామణి అవుతున్నారు. ఇప్పుడు అమెరికన్లుగా చలామణి అవుతున్న వారిలో 90 శాతం వాళ్లే.
ఇలాంటి వారికి ప్రస్తుత వలసలను ప్రశ్నించే నైతిక అర్హత ఎలా ఉంటుంది? ఒక్కమాటలో చెప్పాలంటే వారిది గురివింద తన కింది నలుపును కనపడనీయకుండా దాచుకొని నేను ఎర్రని దాన్ని, అందమైన దాన్ని అని విర్రవీగే గురివింద నీతి మాత్రమే అవుతుంది. అలాంటి వలస మూలాలున్న తెల్లతోలు అమెరికన్లు ఇప్పుడు చదువు కోసం, ఉపాధి కోసం ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చిన విద్యార్థులు, యువతపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. వారి ఉపాధికి అడ్డుపడుతున్నారు. భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారు. ఆ ధోరణిని రాజకీయ అస్త్రంగా మార్చుకున్న రిపబ్లికన్ పార్టీ నిన్నటి ఎన్నికల్లో ఏకంగా గద్దెనే స్వాధీనం చేసుకోగలిగింది. దీంతో ఇటీవల కాలంలో ఆ నేల వెలుపలి నుంచి అమెరికాకు వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు.
నిజానికి అమెరికాలో ఉపాధి పొందగలుగు తున్నది అత్యంత ప్రతిభావంతులైన యువత మాత్రమే. స్థానిక అమెరికన్లు ఇతర దేశాల యువత ప్రతిభతో పోటీ పడలేని ఫలితంగానే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతున్నారనేది సత్యం. స్వయం కృషి, ప్రతిభలతో మాత్రమే మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందే విదేశీ విద్యార్థులపై ఇలాంటి ధోరణి వ్యక్తం కావడం న్యాయమైతే కాదు. వ్యక్తమవుతున్న వలస వ్యతిరేక ధోరణి కారణంగా అమెరికా వెలుపల ఉన్న వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఎంతో మానసిక క్షోభకు లోనవుతున్నారు. అమెరికా వెళ్లడం చదువుకోవడం, ఉపాధి సంపాదించడం అంత సులభమైన పని ఏమీకాదు. ఎంతో ప్రయాసతో కూడుకున్నది. డబ్బుతో ముడిపడింది. అత్యంత ప్రతిభావంతులు మాత్రమే అక్కడికి వెళ్లడానికి అర్హులు. తమ తమ దేశాల్లో మంచి ర్యాంకులతో రాణించి, అవసరమైన ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులైన తరువాత మాత్రమే అమెరికాకు వెళ్లే అనుమతి పత్రమైన వీసాను పొందగలుగుతారు. అంతేకాదు, ప్రతిభ మాత్రమే చాలదు.
ఒక్కొక్క విద్యార్థి కనీస పక్షంగా రూ. 50 లక్షలు ఖర్చు చేయగలిగేతే తప్ప అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ (ఎమ్‌ఎస్) పొందలేరు. అలా పొందిన డిగ్రీతో అక్కడ ఉపాధి పొంది చదువు కోసం చేసిన రూ. 50 లక్షల అప్పును క్రమంగా తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అప్పు తీరిన తరువాత కొంత మెరుగైన జీవితాన్ని పొందగలుగుతారు. ఇలా అక్కడికి వెళ్లిన ప్రతిభావంతులైన యువత మేధోశ్రమ ఫలితంగానే ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన ఆర్థికశక్తిగా ఎదిగింది. అమెరికన్ యువతలో మేధస్సు, ప్రతిభా సామర్థ్యాలు ఉండి ఉంటే విదేశీ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావు కదా. ఈ వాస్తవాన్ని పక్కన బెట్టి వలస వ్యతిరేక ప్రచారాన్ని మొదలు పెట్టింది అక్కడి తెల్ల తోలు అహంకారం. ఈ ధోరణి తోడుగా అధ్యక్ష దొరవారు చిత్రవిచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవన్నీ విదేశీ యువతకు పెద్ద ప్రతిబంధకాలుగా మారిపోయాయి.
ఈ వలస వ్యతిరేక ధోరణి ప్రబలిపోయిన ఫలితంగా ఉపాధి అవకాశాలు చాలా వరకు అడుగంటాయి. ట్రంప్ నిర్ణయాల ఫలితంగా ఇప్పుడు అమెరికాలో షట్ డౌన్ (ప్రభుత్వ ఆర్థిక కార్యక్రమాల్లో స్తంభన) నడుస్తున్నది. 35 రోజులుగా షట్ డౌన్ కొనసాగుతున్నది. షట్‌డౌన్ ఫలితంగా ఇప్పటికే ఎన్నో బిలియన్ల డాలర్లను అమెరికా కోల్పోయిందని అమెరికా ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనసాగుతున్న ట్రంప్ మూర్ఖ ధోరణి కారణంగా షట్‌డౌన్ ఇంకెన్నాళ్లు ఉంటుందో తెలియని అనిశ్చితి అమెరికాలో ఇప్పుడున్నది. ఈస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ త్వరలో కుప్పకూలిపోయే ప్రమాదం సైతం ఉంటుందని ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే ఆయన గద్దెపై కూర్చొని తొమ్మిది నెలలు గడిచిపోయాయి. మరో 40 నెలల పాటు ఆయనకు పాలనా అధికారం ఉంటుం ది. ఆయన తీరు ఇంకా ఇలాగే కొనసాగితే 250 యేళ్ల మేధస్సు, శ్రమల ఫలితంగా నిర్మించబడిన అమెరికా ఆర్థిక వ్యవస్థ పాలిట ట్రంప్ భస్మాసురుడిగా మారిపోతాడని కూడా అంటున్నారు. ఎంఎజిఎ/ మాగా (మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్) నినాదం అర్థం లేనిదై పోవడం ఖాయం అని చెబుతున్నారు.
వలస వెళ్లిన చోటు అమెరికా అయినా, యూరప్ దేశాలు అయినా, పెట్రోలియం వనరులు అధికంగా లభించే అరబ్ దేశాల్లోనైనా శ్రమించి నాలుగు డబ్బులు సంపాదించవలసిందే తప్ప మరోమార్గం మాత్రం లేదు. తాను ఉన్న చోట లభించే వేతనం కంటే కొంత మెరుగైన వేతనం, ఇంకొంత మెరుగైన జీవితం లభించే ప్రాంతానికి వలస వెళ్లడానికే ఏ మనిషిఅయినా మొగ్గుచూపుతాడు. దాన్ని తప్పుగా చూడడం, అభ్యంతరం వ్యక్తం చేయడం అనుచితం. మానవ సమాజాలు దేశాలుగా మారిన తరువాత ఏ దేశానికి ఆ దేశం కొన్ని నియమాలు, నిబంధనలు, పద్ధతులు, చట్టాలు ఏర్పరచుకున్నాయి. వాటిలో భాగమే వీసాల లాంటి అనుమతి పత్రాలు. అలాంటి అనుమతి పత్రాలను ఒక్కో దేశం ఒక్కో రీతిలో తమ తమ దేశాల అవసరాలకు అనుగుణంగా రూపొందించుకున్నాయి. తమ దేశ ఆర్థిక, సాంకేతిక అవసరాలను తీర్చుకునేందుకు ఇతర దేశాల పౌరులను రప్పించే, ఆకర్షించే అనేక ప్రయత్నాలను చాలా దేశాలు చేశాయి. అలా అనేక దేశాల మేధస్సును విస్తృతంగా ఆకర్షించింది అమెరికా. అలా అనేక దేశాల జాతుల ప్రజల రెండున్నర శతాబ్దాల నిరంతర శ్రమ, కృషి, మేధస్సుల వల్ల మాత్రమే నేటి అమెరికా నిర్మాణం సాధ్యమైంది. ప్రపంచం నలుమూలల నుంచి అనేక దేశాల ప్రజల వలసల శ్రమతో మాత్రమే ఆధునిక అమెరికా నిర్మాణం సాధ్యమైందనేది అందరూ అంగీకరించవలసిన సత్యం. నేటి అమెరికా అనేది ఎంతమాత్రం ఒక ఒకే ఒక్క జాతి సమూహం ఎంతమాత్రం కాదు. భిన్నజాతుల మిశ్రమం అయిన నానా జాతి సమితి లాంటి ఒక సంకరజాతి మానవ సమూహమే నేటి ఆధునిక అమెరికా. అలా అమెరికా ఒక గొప్ప దేశంగా మారిపోయింది.
గోవర్ధన్ గందె
93470 56621