మన తెలంగాణ/హైదరాబాద్ : “మీకు చేతనైతే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థినవీన్ కుమార్‌ను ఓడించండి…”అని సిఎం రేవంత్ రెడ్డి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు సవాల్ విసిరారు. ప్రధాని మోడీ, కెసిఆర్ ఒకవైపు, తాను, ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాం ధీ, మజ్లీస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోవైపు నిలబడ్డామని అన్నారు. కాంగ్రెస్ అం టేనే ముస్లింలని, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉ ప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం సిఎం రేవంత్ రోడ్-షో నిర్వహించారు. షేక్‌పేట డివిజన్‌లో జరిగిన రోడ్-షోలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజహరుద్దీన్, పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, ఎంపి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కౌసర్, కాంగ్రెస్ అభ్యర్థి నవీ న్ కుమార్, స్థానిక కార్పోరేటర్ ఫరహత్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సిఎం షేక్‌పేటలోని సాయిబాబా గుడిలో ప్రత్యేక ప్రార్థన చే శారు.
ఈ సందర్భంగా రోడ్-షోలో పాల్గొన్న వారినుద్ధేశించి ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ బిజెపి, బిఆర్‌ఎస్‌లపై విరుచుకుపడ్డారు. బిఆర్‌ఎస్ సహకారం వల్లే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి బిఆర్‌ఎస్ సహకరించినందువల్లే బిజెపికి ఎనిమిది సీట్లు వచ్చాయని, బిఆర్‌ఎస్‌కు డిపాజిట్లు రాలేదని ఆయన తెలిపారు. అందుకే కెసిఆర్‌ను, కెటిఆర్‌ను అవినీతి కేసుల్లో బొక్కలో వేయలేదని ఆయన విమర్శించారు. ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో సహా అనేక మందిపై ఈడి కేసులు పెట్టారు కానీ తండ్రీ-కొడుకును బొక్కలో వేసి, చిప్పకూడు ఎందుకు తినిపించలేదని ఆయన ప్రధాని మోడీని, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.
కాళేశ్వరం అవినీతి విషయంలో సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కోరితే, ఒక్క రోజులోనే కెసిఆర్‌పై సిబిఐ విచారణ చేపట్టి, జైలుకు పంపిస్తామని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని తాను మంగళవారం రోడ్-షోలో కిషన్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తే, మా ఇంటికి వచ్చి చర్చిస్తానంటూ మళ్ళీ తనను ఎదురు ఛాలెంజ్ చేశారని ఆయన దుయ్యబట్టారు. తన ఇంటికి రావాల్సిన అవసరం లేదని, గజదొంగ కెసిఆర్‌ను అరెస్టు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అనుమతి తెచ్చుకోవాలని ఆయన చెప్పారు. జూబ్లీహిల్స్‌లో బిజెపికి డిపాజిట్ దక్కదన్నారు. డిపాజిట్ తెచ్చుకుంటే కిషన్ రెడ్డి గెలిచినట్లేనని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు కారు టైర్లు పీకేసి గ్యారేజీకి పంపించారని, కొడితే కెసిఆర్ ఫాం హౌస్‌లో బొక్కా బొర్లా పడ్డారని అన్నారు.వేల కోట్లతో కెసిఆర్, హరీష్ రావు, కెటిఆర్, కవిత వేర్వేరు చోట్ల ఫాం హౌస్‌లు కట్టుకున్నది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజెపి నేతలు బిఆర్‌ఎస్ గుర్తు అయిన కారు గుర్తుతో ఓట్లు అడుగుతున్నారని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తే బిజెపికే వేసినట్లు అవుతుందని ఆయన తెలిపారు. నాణేనికి రెండు వైపులా బిజెపి, బిఆర్‌ఎస్ అని ఆయన విమర్శించారు.
సర్కార్‌కు రెండు కళ్ళు..
హిందూ-ముస్లింలు తమ సర్కారుకు రెండు కళ్ళ వంటి వారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అజహరుద్దీన్‌ను తన సహచర మంత్రిగా తీసుకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఏమి ఇబ్బంది అయ్యిందని ఆయన ప్రశ్నించారు. ‘నీ అయ్య జాగీరు ఏమైనా అడిగామా? లేక గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ భూములేమైనా అడిగామా?’ అని ఆయన ప్రశ్నించారు. అమిత్ షా వచ్చి అడ్డు చెప్పినా అజహర్‌ను మంత్రివర్గంలోకి తీసుకునే వాడినని ఆయన తెలిపారు. ముస్లింలకు వివిధ కార్పొరేషన్ పదవులు ఇచ్చానని, క్రికెట్ క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చామని ఆయన వివరించారు. షెక్‌పేట్ డివిజన్ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి పదిహేను వేల మెజారిటీ ఇవ్వాలని ఆయన కోరారు. సబర్మతి నదీ, యమునా నదీ అభివృద్ధి చేసినట్లు మూసీ పరివాహక ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయరాదని ఆయన ప్రశ్నించారు.
ఏకగ్రీవం సంప్రదాయానికి తిలోదకాలు
ఎవరైనా ఎమ్మెల్యే మరణిస్తే ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయానికి కెసిఆర్ తిలోదకాలు ఇచ్చారని ఆయన విమర్శించారు. గతంలో ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మరణిస్తే, ఆ కుటుంబం నుంచి ఎవరినైనా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వస్తే సెంటమెంట్ ఏమీ లేదని కెసిఆర్ అభ్యర్థిని పోటీకి దించారని ఆయన తెలిపారు. ఇప్పుడేమో కెటిఆర్ సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు జూబ్లీహిల్స్‌కు రాని సన్నాసులు ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కృష్ణానగర్ నంది అవార్డులు తెచ్చింది, ఇప్పుడు ఆస్కార్ అవార్డులు తెచ్చిందని ఆయన తెలిపారు. సినీ కార్మికులకు చిత్రపురి కాలనీలో భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన చెప్పారు.
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నంది అవార్డు ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గద్దర్ అవార్డులు ఇచ్చిందని ఆయన తెలిపారు. కెటిఆర్ మాత్రం గెస్ట్ హౌస్‌ల్లో సినీ నటులతో తిరిగారు తప్ప ఏనాడూ సినీ కార్మికుల సమస్యలు పరిష్కరించలేదన్నారు. ఈ ప్రాంతాలో ఉండే కార్మికులకు ఆరోగ్య భద్రత, జీవిత భీమా, ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి, లంచ్ కూడా ఏర్పాటు చేయిస్తానని అన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంత్రి అయిన తర్వాత సన్న బియ్యం ఇస్తున్నారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన దొడ్డు బియ్యం బర్లకు కూడా పెట్టేవారు కాదన్నారు. దసరా పండుగకు ఆడబిడ్డలు వెళ్ళాలనుకుంటే ఉచితంగా వెళ్ళేందుకు బస్సు సౌకర్యం కల్పించామన్నారు. డ్బ్బై వేల ఉద్యోగాలు కల్పించి పత్రాలు స్టేడియంలో అందించామన్నారు.
సన్న బియ్యం, ఉచిత బస్సు సౌకర్యం, రేషన్ కార్డులు కెసిఆర్ ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ఫార్ములా ఈ-కార్ల కేసులో యాభై కోట్ల అవినీతికి పాల్పడిన కెటిఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంకా ఈ రోడ్-షోలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.