నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్‘. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 7న హిందీతో పాటు తెలుగులో.. ఈ నెల 14న, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ “ది గర్ల్ ఫ్రెండ్ కాకుండా మరో టైటిల్ ఈ సినిమాకు చెప్పమంటే నీ జీవితమంతా నేనే అని చెప్పాలి. అమ్మాయి, అబ్బాయి తమ జీవిత భాగస్వామి గురించి ఇలాగే అనుకుంటూ అతి సున్నితంగా సాగే ఈ సినిమా చివరకు అతి ఘాటుగా ముగుస్తుంది. ఈ సినిమా చూశాక చాలామంది ఆ రాత్రి నిద్రపోరు. అంతగా ఈ మూవీ వారిని వెంబడిస్తుంది. రశ్మిక ఈ సినిమాలో జీవించేసింది”అని అన్నారు. ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ సినిమానే ప్రపంచంగా జీవించే డైరెక్టర్ రాహుల్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని తెలియజేశారు.
డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ “ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా నా కెరీర్ లో ఒక బ్యూటిఫుల్ జర్నీగా మిగిలిపోతుంది. అల్లు అరవింద్ ఓకే చెప్పకుంటే ఈ ప్రాజెక్ట్ ఉండేది కాదు. ఈ సినిమాలో రశ్మిక, దీక్షిత్ నటనను ప్రేక్షకులు మర్చిపోలేరు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దీక్షిత్ శెట్టి, ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి, హేషమ్ అబ్దుల్ వాహబ్ తదితరులు పాల్గొన్నారు.