రెండు దశాబ్దాల పాటు అవినీతి, అక్రమాలు, అవకాశవాద రాజకీయాలతో బీహార్ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని బీహార్ కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకులు,రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బీహార్ రాష్ట్రం పశ్చిమ చంపారన్ జిల్లా చనుపటియా అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తో కలిసి మంత్రి పొంగులేటి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎన్‌డిఏ కూటమికి ఓటమి భయం పట్టుకుందని, అందువల్లనే అలవికాని హామీలను ఇస్తోందని విమర్శించారు. వారి ఎన్నికల ప్రణాళికలో కోటి వరాలు ప్రకటించడి, యువతకు కోటి ఉద్యోగాలు, కోటి మంది లక్‌పతి దీదీలు హామీలు ఇచ్చారని, అధికారంలో ఉన్న ఈ 20 సంవత్సరాల్లో ఎన్ని
ఉద్యోగాలు ఇచ్చారోచ ఎంతమంది దీదీలను లక్‌పతులుగా చేశారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నపుడు వీటిని ఎందుకు అమలు చేయలేదని పొంగులేటి ప్రశ్నించారు. బీహార్ ప్రజలను కొత్త హామీలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. మహా ఘట్ బంధన్‌ను గెలిపిస్తే తెలంగాణ మోడల్ పాలనను బీహార్‌లో అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ది, సంక్షేమానికి సమ ప్రాధాన్యతను ఇస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని వివరించారు. రైతులకు రుణమాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయిలకే సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం, అర్హులైన పేదలందరికీ ఇందిర్మమ్మ ఇళ్ల నిర్మాణం వంటి హామీలు అమలు చేస్తున్నామని వివరించారు. బహిరంగ సభలో బీహార్ రాష్ట్ర ఇంచార్జ్ కృష్ణ అల్వర్, మహా ఘట్ బంధన్ అభ్యర్థి అభిషేక్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.