ప్రజల అకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన కోనసాగిస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కోనసాగాలంటే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మంత్రి జూపల్లి కృష్ణారావు తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించిన జూపల్లి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఎర్రగడ్డ డివిజన్ లో బోరబండలోని సాయిబాబా నగర్‌లో బుధవారం నవీన్ యాదవ్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వృద్దులను, మహిళలను అప్యాయంగా పలుకరిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ను ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్ని ఇబ్బందులు ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని అన్నారు. ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని తెలిపారు.
కేసీఆర్ కుటుంబమే రౌడీ కుటుంబం
రాష్ట్ర ఖజానాను లూటీ చేసిన కేసీఆర్ కుటుంబమే రౌడీ కుటుంబమని మంత్రి జూపల్లి మండిపడ్డారు. గతంలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే పునీతులా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో ఉంటే రౌడీ షీటర్లు అంటారా అని నిలదీశారు. జూబ్లీహిల్స్‌లో గెలుస్తామని బీఆర్‌ఎస్ నాయకులు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. కేటీఆర్ కు కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు లేదని అన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని నిలువునా దోచుకుని బాకీ కార్డు పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ద్వజమెత్తారు. దోచుకున్న డబ్బుతో విచ్చలవిడిగా ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని, బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని అన్నారు. ప్రజా వ్యతిరేఖ బీఆర్‌ఎస్ పార్టీని అడుగడుగునా నిలదీయాలని కోరారు. బీఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు.