న్యూఢిల్లీ : వచ్చే నెల నుంచి భారత్, రష్యా నుంచి ముడిచమురు దిగుమతిని నిలిపివేస్తుంది. నేరుగా రష్యా క్రూడాయిల్ రాక మనకు ఆగిపోతుంది. రష్యా ప్రముఖ చమరు కంపెనీలు రోస్‌నెఫ్ట్, లూకాయిల్‌పై అమెరికా భారీ స్థాయి ఆంక్షలు విధించిన తరువాత దీని ప్రభావం భారత్‌పై పడింది. అనివార్యంగా ఈ కంపెనీల నుంచి ముడిచమురు దిగుమతిని నిలిపివేయాల్సిన చక్రబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ నెల చివరి నుంచి రష్యా ముడిచమురు దిగుమతిని తగ్గించుకుంటూ వచ్చే నెల నాటికి పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు వెల్లడైంది. ఈ ఏడాది చివరి నాటికి రష్యా చమురును భారత్ పూర్తి స్థాయిలో నిలిపివేస్తుందని ట్రంప్ పదేపదే చెపుతూ వచ్చారు. రష్యా కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు ఈ నెల 21 నుంచి అమలులోకి వస్తాయి. దీనితో ఆయా కంపెనీలపై ఆధారపడే పలు దేశాలు ఇకపై వేరే మార్గాలను వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో చమురు సరఫరా గొలుసుకట్టు వ్యవస్థకు కుదేలు కానుంది.
ఉక్రెయిన్‌తో యుద్ధం తరువాత రష్యాపై ఆంక్షల దశ నుంచి భారతదేశం రష్యా నుంచి అతి ఎక్కువ మోతాదులో ముడిచమురు నేరుగా దిగుమతి చేసుకొంటోంది. ప్రత్యేకించి ట్రంప్ ఆంక్షలకు గురైన ప్రధాన కంపెనీల నుంచి రిలయన్స్ పెట్రో సంస్థ అత్యధిక వాటాలో చమురు తెప్పించుకొంటోంది. ఇప్పుడు రష్యా క్రూడాయిల్ దిగుమతి ఆగిపోనుండటంతో రిలయన్స్ ఇతర భారతీయ కంపెనీలకు పిడుగు పాటు కానుంది. భారతీయ రిఫైనరీలు తమ దిగుమతులలో సగం వరకూ రష్యా నుంచే తెప్పించుకుంటున్నాయి. రిఫైనరీల ద్వారానే మార్కెట్‌కు అవసరం అయిన పెట్రోలు, డీజిల్ అందుతుంది.
ఇప్పుడు రష్యా ఆంక్షలతో క్రమేపీ భారతీయ చమురు కంపెనీలు, రిఫైనరీలు ఈ లోటును ఇతరత్రా మార్గాల ద్వారా భర్తీ చేసుకోవల్సి ఉంటుంది. మారిటైం ఇంటలిజెన్స్ విశ్లేషణ సంస్థ కెప్లెర్ ఇప్పటి పరిస్థితి గురించి స్పందించింది. డిసెంబర్‌లో రష్యా నుంచి భారీ స్థాయిలో క్రూడాయిల్ రాక తగ్గుతుంది. డిసెంబర్‌లో ఈ క్షీణత ప్రభావం మన మార్కెట్‌పై తీవ్రంగానే పడుతుంది. అయితే వచ్చే ఏడాది ఆరంభంలో క్రమేపీ ఈ ప్రభావం నుంచి బయటపడవచ్చు. కానీ క్రూడాయిల్ రప్పించుకునేందుకు సంబంధిత మధ్యవర్తులు లేదా దళారులు , ప్రత్యామ్నాయ మార్గాలను తక్షణ రీతిలో ఇప్పటి నుంచే వెతుక్కోవల్సి ఉంటుందని విశ్లేషణ సంస్థ తెలిపింది.