హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు జాతీయ రహదారి 65 పై ఆర్టిసి బస్సుకు ప్రమాదం తప్పింది. ముత్తంగి గ్రామ సమీపంలో ముందు ఉన్న కార్లను తప్పించబోయి బ్రేక్ పడకపోవడంతో డివైడర్ ఎక్కించి కరెంట్ స్తంభానికి ఆర్టిసి బస్సు ఢీకొంది. మేడ్చల్ డిపోకు చెందిన బస్సు మేడ్చల్ నుండి బాలానగర్ మీదుగా ఇస్నాపూర్ వెళ్తున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికులు సమాచారం మేరకు పటాన్ చెరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు పర్యవేక్షిస్తున్నారు. బస్సు ప్రయాణికులకు ఎవ్వరికి ఏం కాకపోవడంతో డ్రైవర్, కండక్టర్ ఊపిరి పీల్చుకున్నారు.
అదే విధంగా నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం రహదారిపై రోడ్డు ప్రమాదం తప్పింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి బస్సు అదుపు తప్పింది. బురదలో కూరుకుపోయి రహదారిపై రోడ్డుకు అడ్డం బస్సు తిరగడంతో బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. సుమారు గంట పాటు వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి.