మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి, -బిఆర్‌ఎస్‌ల మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే 11వ తేదీలోగా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌ను, ఆ పార్టీ ఎంఎల్‌ఎ హరీష్‌రావును కాళేశ్వరం అవినీతి కేసులో సిబిఐతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించి అరెస్టు చేయించాలని సిఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నే పథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెహమత్ నగర్ లో భారీ రోడ్డు-షో నిర్వహించారు. ఈ రోడ్-షోలో రాష్ట్ర మంత్రులు కో మటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజహరుద్దీన్, పిసి సి చీఫ్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలనుద్ధేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ బిఆర్‌ఎస్-బిజెపిల బంధాన్ని తూర్పార బట్టారు. ఆ రెండు పార్టీల నేతలు ప గలు కొట్లాడుకుంటారని, రాత్రి అలయ్-బలయ్ అంటారని అ న్నారు. కారు గుర్తు పార్టీని గెలిపిస్తే, ఆ కారు ఢిల్లీ వెళ్ళగానే కమలం పవ్వుగా మారిపోతుందని ఆయన తూర్పారబట్టారు.
కాళేశ్వరం ప్రా జెక్టు అవినీతి విషయంలో తాము అసెంబ్లీలో చర్చించి అందరి ఆమోదంతో సిబిఐ విచారణకు కోరుతూ తీర్మానం ఆమోదిచామన్నారు. అయితే ఈ అవినీతి విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సిబిఐ విచారణకు ఆదేశిస్తే నలభై ఎనిమిది గంటల్లో అరెస్టు చేయించి చర్లపల్లి, చంచల్‌గుడా జైలుకు పంపిస్తామని అన్నారని ఆయన గుర్తు చేశారు. నలబై ఎనిమిది గంటలు కాదు కదా వంద రోజులైందన్నారు. అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఫార్ములా ఈ-కార్ల కేసులో కెటిఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.అవినీతి కేసులో అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా తాము గవర్నర్‌ను కోరితే ఇంత వరకు అనుమతి రాలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమీత్ షా ఎందుకు మాట్లాడడం లేదన్నారు. త్రిబుల్ తలాఖ్ వంటి ఏ నిర్ణయాన్ని కేంద్రం తీసుకున్నా కెసిఆర్ మద్దతునిస్తున్నందుకే వారు అండగా ఉంటున్నారని ఆయన విమర్శించారు.
బిఆర్‌ఎస్ కారు స్టీరింగ్ ప్రధాని మోడీ చేతిలో ఉందని ఆయన దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు బిఆర్‌ఎస్ నేతలకు ఏటిఎంలా మారిందని లోగడ అమీత్ షా విమర్శించారని ఆయన గుర్తు చేశారు.మీది ఫెవికాల్ బంధం కాకపోతే పోలింగ్‌లోగా వారిపై సిబిఐ చేత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించి అరెస్టు చేయించాలని ఆయన కేంద్ర మంత్రిని డిమాండ్ చేశారు. గూడుపుఠాణి ఏమిటీ అని ఆయన కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ ముఖ చిత్రం మార్చేస్తా..
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను ముప్పై వేల మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. నవీన్ గెలుపొందిన తర్వాత డిసెంబర్ నెలాఖరులోగా రహ్మత్ నగర్‌లోని ఖబరాస్థాన్ సమస్యను పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. జూబ్లీహిల్స్‌లో చెత్త-చెదారం ఉందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించడాన్ని ఆయన ప్రస్తావిస్తూ రెండేళ్ళ క్రితం వరకూ మున్సిపల్ మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. ఈ చెత్తకు కారణం ఎవరు?, ప్రచారానికి ఇక్కడికి వస్తే ఆయన్ను చెత్త కుండీకి కట్టేయాలని ముఖ్యమంత్రి అన్నారు. జూబ్లీహిల్స్ బిఆర్‌ఎస్ అభ్యర్థి సునీతకు న్యాయం చేస్తానని అంటున్నారని, సొంత చెల్లికి ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఇంటి నుంచి మెడ పట్టి బయటకు గెంటించిన కసాయి అని ఆయన విమర్శించారు. సొంత చెల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేయిస్తానంటే నమ్ముతామా? అని ఆయన ప్రశ్నించారు. సొంత చెల్లినే తనను ఇంటి నుంచి గెంటేశారని ఆదిలాబాద్ నుంచి రాష్ట్ర పర్యటన చేస్తూ కన్నీటిపర్యంతమవుతున్నారని ఆయన తెలిపారు.
బెంజ్ కారు ఫంక్షర్ అయితే షెడ్డుకు పంపించి బావ-బామ్మర్థి ఆటోల్లో తిరుగుతున్నారని ఆయన అన్నారు. శిల్పారామం తాము కడితే కెటిఆర్ అక్కడ నిలబడి సెల్పీ దిగారని, హై-టెక్ సిటీ వద్ద పొటోలు దిగారని అన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బుతో జన్వాడలో కెటిఆర్, గజ్వేల్‌లో కెసిఆర్, మొయినాబాద్‌లో హరీష్ రావు, శంకర్‌పల్లిలో కవిత ఫామ్ హౌస్‌లు కట్టుకున్నారని ఆయన విమర్శించారు. ఇది నిజం కాదని కెటిఆర్ చెబితే తాను జూబ్లీహిల్స్ నుంచి వంద బస్సుల్లో మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తానన్నారు. రబ్బర్ చెప్పులు కూడా లేని వాళ్ళు వందల కోట్లు ఎలా సంపాదించారని ఆయన ప్రశ్నించారు.
బిజెపికి డిపాజిట్ రాదు..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బిజెపికి డిపాజిట్ కూడా రాదన్నారు. అజహర్‌ను మంత్రివర్గంలో తీసుకోవడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి అయ్య జాగీరును తీసుకున్నామా? గుజరాత్‌లో ప్రధాని మోడీ ఆస్తిని లాక్కున్నామా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రివర్గంలో తాము కొండా సురేఖ, సీతక్కను తీసుకున్నామని, బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహిళా మంత్రి లేరని ఆయన తెలిపారు. పేదల పెన్నిది పి. జనార్దన్ రెడ్డి మరణిస్తే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వస్తే కెసిఆర్ సహకరించకుండా పోటీ పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడేమో కెటిఆర్ సునీత విషయంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించలేదని మాట్లాడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగిస్తూ జూబ్లీహిల్స్‌లో నవీన్ కుమార్ యాదవ్‌ను గెలిపిస్తే, రేవంత్ రెడ్డే మీ ఎమ్మెల్యే అయినట్లు అని చెప్పారు.