రంగారెడ్డి జిల్లా, మహేశ్వరంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు రామచంద్రగూడ కుంట తెగింది. దీంతో మోడల్ స్కూల్, కస్తూర్బా స్కూల్, డైట్ కాలేజీలు నీట మునిగాయి. విద్యార్థులు భయందోళనతో బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూశారు. పోలీసులు, స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టి విద్యార్థులను వరద నీటి నుండి రక్షించారు. అయితే వరద నీటిలో విద్యార్థుల వస్తువులు పాఠ్య పుస్తకాలు నీటిపాలయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో, స్థానిక పోలీసు శాఖ నేతృత్వంలో సహాయక చర్యలు చేపట్టారు. సిఐ వెంకటేశ్వరులు, ఎస్‌ఐలు ప్రసాద్, రాఘవేందర్‌రావు, ధనుంజయ్ తదితరులు వరద నీరు చేరిన బాధితుల ఇళ్లల్లో పర్యటించి, నీటమునిగిన ఇళ్ల నిర్మాణ నష్టం, నివాసితుల పరిస్థితులను సమీక్షించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులకు సమస్యలపై సూచనలు అందజేశారు.