దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిఎం పోషణ్ పథకం కింద మధ్యాహ్న భోజనం వంట సరుకుల ధరలను కేంద్రం పెంచింది. కాగా, కేంద్రం ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్రంలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి వంట సరకుల ధరలను పెంచుతూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వంట ఏజెన్సీ మహిళలు 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో విద్యార్థికి రూ.5.45 చొప్పున చెల్లిస్తుండగా దానిని రూ.6.19కి పెంచారు. 6 నుంచి 8 తరగతులకు ఒక్కో విద్యార్థికి రూ.8.17 నుంచి రూ.9.29కు, 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.10.67 నుంచి రూ.11.79కి పెంచారు. ఈ ధరలు గుడ్డును మినహాయించి మిగిలిన వంట సరుకులకిచ్చేవి. ఒక్కో విద్యార్థికయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరిస్తాయి.