ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటి విలువ, నీటి విలువ తెలియదు అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత నిరంజన్ రెడ్డి విమర్శించారు. 60 ఏండ్ల కలను సాకారం చేసిన కెసిఆర్ గురించి సిఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడడం సరికాదని అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏం చేస్తారో చెప్పకుండా ఇప్పుడు కూడా కెసిఆర్ మీద, హరీష్ రావు మీద ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 14 ఏండ్లు ఒక ప్రత్యేకమైన పద్దతిలో ప్రపంచ ఉద్యమాలకు కొత్త నిర్వచనం ఇచ్చేలా కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం పోరాడామని తెలిపారు. 60 ఏండ్ల తెలంగాణ కలను సాకారం చేయడం కోసం తెలంగాణ ప్రజల మీద జరిగిన దాడి, వివక్ష, అవమానాలను ప్రజలకు వివరించి తెలంగాణ సబ్బండ వర్గాలను ఏకంచేసి తెలంగాణను సాధించిన కెసిఆర్ గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 10 ఏండ్లు తెలంగాణ పునర్నిర్మాణంలో కెసిఆర్ అద్భుతంగా పనిచేశారని, దానికి ఎవరి సర్టిఫికెట్లు అవసరం లేదని పేర్కొన్నారు. సమాజం, చరిత్ర గుర్తిస్తుందని చెప్పారు.
భారత సమకాలీన రాజకీయాల్లో 9 సార్లు ఎంఎల్‌ఎగా, నాలుగు సార్లు ఎంపీగా, ఐదు దశాబ్దాలకు పైగా సమకాలీన రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నాయకుడు కెసిఆర్ అని నిరంజన్ రెడ్డి ప్రశంసించారు. రాజకీయాల్లో పార్టీలకు, వ్యక్తులకు మధ్య భిన్నాభిప్రాయాలు, విశ్వాసాలు ఉంటాయని, అంతమాత్రాన ఇష్టమున్నట్లు ఎదుటివారిని తూలనాడడం అనేది కుసంస్కారాన్ని తెలియజేస్తుందని అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ రెండు తరాల భవిష్యత్ కోల్పోయిందని, మరో తరం నష్ట పోవద్దని దీక్షా, దక్షతలతో శక్తిని కూడగట్టుకుని అభివృద్ధి, సంక్షేమం దిశగా అడుగులు వేశారని చెప్పారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సహకరించుకున్నా, మరోవైపు ఇంటి దొంగలు, పక్కవారు రకరకాల కేసులతో ప్రాజెక్టులు, ఉద్యోగుల, హైకోర్టు విభజనలను అడ్డుకుంటూ అవరోధాలు కల్పించినా అన్నింటినీ చేదించుకుంటూ కెసిఆర్ తెలంగాణను అగ్రభాగాన నిలబెట్టారని వ్యాఖ్యానించారు. అన్నింటికీ కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, ప్రకటనలు, అవార్డులు, పార్లమెంటులో కేంద్రం చేసిన ప్రకటనలే సాక్ష్యం అని పేర్కొన్నారు.