మణికొండలో కాల్పులు కలకలం సృష్టించాయి, ఎపికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఇంటి వివాదంలో మంగళవారం కాల్పులు జరిపారు. పోలీసుల కథనం ప్రకారం…ఎపికి చెందిన మాజీ ఎమ్మెల్సీ కెఈ ప్రభాకర్‌కు మణికొండలోని పంచవటి కాలనీ, రోడ్డు నంబర్ 18లో ఇళ్లు ఉంది. దీనిని తన కూతురికి వివాహం సమయంలో రాసి ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు అభిషేక్ గౌడ్‌కు మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ కూతురును 14ఏళ్ల క్రితం ఇచ్చి వివాహం చేశారు. దంపతుల మధ్య వివాదం రావడంతో ఏడాది నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అభిషేక్ తనకు వివాహం సమయంలో రాసి ఇచ్చిన ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా గత నెల 25వ తేదీన మణికొండకు వెళ్లి అందులో ఉంటున్న వారిని గన్‌తో బెదిరించారు.
ఈ సమయంలో అక్కడికి కెఈ ప్రభాకర్ రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ సమయంతో తన అల్లుడు తనపై గన్ పెట్టి బెదిరించాడని కెఈ ప్రభాకర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అభిషేక్ గౌడ్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ మంగళవారం మణికొండలోని ఇంటికి 25మంది అనుచరులను తీసుకుని వెళ్లాడు. భవనాన్ని లీజుకు తీసుకుని ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయాలని గొడవకు దిగాడు. తమకు సమయం ఇవ్వాలని వారు చెబుతున్న సమయంలోనే సహనం కోల్పోయి గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల భయానికి అక్కడ ఉన్న వారు పారిపోయారు, కాల్పుల శబ్ధం విన్న స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.
లీజులో ఉన్న భవనం…
వివాదానికి కారణమైన భవనాన్ని కృష్ణ ధర్మ పరిషత్‌కు చెందిన ఐదేళ్లు లీజుకు తీసుకున్నారు. నెలకు రూ.1.50లక్షలు చెల్లించేలా లీజుకు తీసుకున్న తర్వాత ధర్మ పరిషత్‌కు చెందిన సభ్యులు రూ.1.8కోట్లు పెట్టి రినోవేషన్ చేయించారు. లీజుకు తీసుకుని ఏడాది కావడంతో ఇంకా ఐదేళ్లు ఉంది, గడవు ముగియకముందే అభిషేక్, కెఈ ప్రభాకర్ అందులో ఉంటున్న వారిని ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారు. దీనిపై కృష్ణ ధర్మ పరిషత్‌కు చెందిన వారు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫైరింగ్ మా దృష్టికి రాలేదుః వెంకన్న, రాయదుర్గం ఇన్స్‌స్పెక్టర్
మణికొండలోని పంచవటి కాలనీలో కాల్పులకు సంబంధించిన జరిగిన కాల్పుల విషయం తమ దృష్టికి రాలేదని రాయదుర్గం ఇన్స్‌స్పెక్టర్ వెంకన్న తెలిపారు. మణికొండలోని పంచవటి కాలనీలో ఉన్న ఆస్తి గురించి ఎపికి చెందిన రాజకీయ నాయకుడు, అతడి అల్లుడి మధ్య వివాదం ఉందని తెలిపారు. దీనిపై ఇరువురు అక్టోబర్ 25వ తేదీన ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కుటుంబ కలహాల వల్ల భార్యభర్తలు ఏడాది నుంచి వేరువేరుగా ఉంటున్నారని తెలిపారు. గన్‌ఫైరింగ్‌కు సంబంధించిన విషయం తమ దృష్టికి రాలేదని, దానికి సంబంధించిన సాక్షాలు కూడా తమ దృష్టికి రాలేదని తెలిపారు. కాల్పులకు సంబంధించిన సాక్షాలు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.