విద్య, ఆరోగ్యం, ఉపాధి ఉద్యోగాల సమస్యలపై యువత ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా సోషల్ మీడియా రీల్స్‌కు యువతను బానిస చేయాలని ప్రధాని మోడీ కోరుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. బీహార్ లోని ఔరంగాబాద్, గయజీ ఎన్నికల ర్యాలీల్లో మంగళవారం రాహుల్ మాట్లాడారు. “ సామాజిక మాధ్యమాలు, రీల్స్ చేయడం తదితర కార్యకలాపాలకు యువత బానిస కావాలని మోడీ కోరుకోవడం 21 వ శతాబ్దపు కొత్త మత్తు. అలాంటిదే ఆయన కోరుకుంటున్నారు. అలా చేస్తే విద్య, ఆరోగ్యం, ఉద్యోగం సమస్యలపై తమ ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయకుండా యువత దృష్టిని మరల్చడం ” అని రాహుల్ ఆరోపించారు. “బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ గెలవలేదని మోడీ, అమిత్‌షాలకు తెలుసు. అందుకని ఓటు చోరీకి పాల్పడుతున్నారు.” అని వ్యాఖ్యానించారు.
ఆర్‌జెడితో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకోవడంపై బీజేపీ, ఎన్‌డిఎ నాయకులు ఆర్‌జేడికి ఓటు వేస్తే జంగిల్ రాజ్ తిరిగి వస్తుందని పదేపదే విమర్శించడాన్ని ఉదహరిస్తూ ఢిల్లీలో ఓట్ల చోరీకి పాల్పడి జంగిల్ రాజ్ మోడీ తీసుకు వచ్చారని, మహారాష్ట్ర,హర్యానాల్లోనూ అలాగే జరిగిందని పేర్కొన్నారు. బీహార్‌లోకూడా అదే మోడీ కోరుకుంటున్నారని . కానీ ఆయన ఎత్తుగడలను బీహార్ ప్రజలు ఓడిస్తారని తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు. బీహార్ లోకి ఇండియా కూటమి అధికారం లోకి వస్తే అత్యంత వెనుకబడిన, సామాజిక అట్టడుగు వర్గాలు, దళితుల ప్రభుత్వమే అవుతుందని రాహుల్ స్పష్టం చేశారు. ఇది బీహార్‌ను తయారీ కేంద్రంగా మార్చుతుందని, తయారైన వస్త్రాలు, మొబైల్ ఫోన్లపై ‘మేడ్ ఇన్ బీహార్ ’ అనే ముద్ర ఉంటుందని , చైనా కూడా దీన్ని గుర్తిసుందని పేర్కొన్నారు. నలందాలో అత్యాధునిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడమే కాక, రాష్ట్ర పునర్ వైభవం సాధిస్తుందని చెప్పారు.