బీహార్‌లో ఇండియా కూటమి అధికారం లోకి వస్తే రైతులకు వరిపంటపై క్వింటాల్‌కు రూ.300, గోధుమపై రూ.400 వంతున బోనస్ అందజేస్తామని ఆర్‌జేడీ నేత తేజస్వియాదవ్ మంగళవారం వెల్లడించారు. పత్రికావిలేకరుల సమావేశాన్ని ఉద్దేశిస్తూ విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన తేజస్వియాదవ్ విపక్ష కూటమి అధికారం లోకి వస్తే అన్ని రాష్ట్రాల్లోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పిఎసిఎస్) , ప్రాథమిక మార్కెటింగ్ సహకార సొసైటీల (వ్యాపార మండళ్లు) అధిపతులకు “ ప్రజా ప్రతినిధుల హోదా ” కల్పించడమవుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో 8400 పిఎసిఎస్‌లు ఉన్నాయని తెలిపారు. ఇవే కాకుండా బీహార్ లోని రైతులకు నీటిపారుదల ప్రయోజనాల కోసం ఉచిత విద్యుత్ సరఫరా చేయడమవుతుందని, ప్రస్తుతం వ్యవసాయానికి వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కు 55 పైసలు రైతులకు ఛార్జి విధిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రిజిస్టర్ అయిన 8400 వ్యాపార మండళ్లు, పిఎసిఎస్‌ల మేనేజర్లకు గౌరవవేతనం అందివ్వాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. మై బహన్ స్కీమ్ కింద మహిళలకు ప్రతినెలా వారి బ్యాంకు అకౌంట్లలో రూ. 2500 బదిలీ చేయడానికి ఇప్పటికే హామీ ఇచ్చామని, ఇదే స్కీం కింద జనవరి 14న మకర సంక్రాంతి నాటికి ముందుగా రూ.30 వేలు వంతున వారి అకౌంట్లలో బదిలీ చేయడానికి నిర్ణయించామన్నారు.