తెలంగాణలో ఆర్టీసి బస్సు ప్రమాదాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, మిర్జాగూడ గేటు సమీపంలో సోమవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో 19మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరవకముందే రాష్ట్రంలో మరో రెండు బస్సులు ప్రమాదలు చోటుచేసుకున్నాయి.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట బ్రిడ్జ్ వద్ద ఆర్టీసి బస్సు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
ఇక, నల్గొండ జిల్లా, వేములపల్లి మండలంలోని బుగ్గబావిగూడెం వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టడంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న నలుగురు కూలీలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.