47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల జట్టు చారిత్రక విజయం సాధించింది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో గెలుపొంది.. ఏళ్ల కలను సాకారం చేస్తూ తొలిసారి టీమిండియా ప్రపంచకప్ ను కైవసం చేసుకుంది. దీంతో భారత మహిళా జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో పంజాబీ ప్లేయర్లకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ నజరానా ప్రకటించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, అమన్‌జ్యోత్ కౌర్ లకు రూ. 11 లక్షలు నగదు బహుమతి అందించనున్నట్లు తెలిపింది. ఈ మెగా టోర్నీలో కెప్టెన్ హర్మన్ తోపాటు అమన్ జ్యోత్ కూడా అటు బ్యాట్ తోపాటు బాల్ తోనూ రాణించింది. ఇక, ఫీల్డింగ్ కోచ్ మునీష్ బాలికి రూ. 5 లక్షల నగదు ఇవ్వనున్నట్లు అసోసియేషన్ పేర్కొంది. కాగా, బిసిసిఐ కూడా టీమిండియా మహిళా జట్టుకు రూ.51 కోట్ల భారీ నజరానా ప్రకటించింది.