ఆంధ్రప్రదేశ్ లో స్వల్ప భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 4.20 గంటల ప్రాంతంలో విశాఖపట్నంలో భూమి కంపిించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.7గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. విశాఖలోని మురళీనగర్, రాంనగర్, అక్కయ్యపాలెంలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. అలాగే, గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్ ప్రాంతాల్లోనూ కొన్ని సెకండ్లు భూమి కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవిచండంతో ప్రజలు తీవ్ర భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జి మాడుగుల గ్రామం సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. భూకంపం తక్కువ తీవ్రతతో ఉందని, ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు నిర్ధారించారు. అయితే, ముందుజాగ్రత్తగా, నివాసితులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.