ముంబై : భాబా అటామిక్ రీసెర్చి సెంటర్ ( బార్క్ ) సైంటిస్టునని నమ్మించి అక్రమాలకు పాల్పడిన నకిలీ శాస్త్రవేత్త అఖ్తర్ హుస్సెయిని (60) గత నెల ముంబైలో అరెస్టు కావడం సంచలనం కలిగించింది. న్యూక్లియర్ డేటాను అందజేసి విదేశీ నిధులు కాజేశాడన్న నేరారోపణపై అఖ్తర్ గత నెల ముంబైలో అరెస్ట్ అయ్యాడు. ఈయన గురించి మరిన్ని వివరాలు బయటపడ్డాయి. ఝార్ఖండ్ లోని జెంషెడ్‌పూర్‌కు చెందిన ఈయన నుంచి అణ్వాయుధాలకు సంబంధించిన డేటా, 10 కు పైగా మ్యాప్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనేక నకిలీ పాస్‌పోర్టులు, ఆధార్, పాన్ కార్డులు, నకిలీ బార్క్ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఐడీ కార్డుల్లో ఒకదానిలో అలీ రజా హుస్సేన్‌గా, మరో దానిలో అలెగ్జాండర్ పాల్మెర్‌గా బోగస్ పేర్లు ఉన్నాయి.
అఖ్తర్ సోదరుడు అడిల్ కూడా ఢిల్లీలో అరెస్ట్ అయ్యాడు. ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ వివరాల ప్రకారం హుస్సేయిని సోదరులు విదేశీ నిధులు పొందడం 1995 నుంచి ప్రారంభమైంది. మొదట్లో లక్షల రూపాయలు వీరికి అందేవి. 2000 తరువాత నుంచి కోట్ల రూపాయలు అందుతున్నాయి. అటామిక్ రీసెర్చి సెంటర్ తోపాటు ఇతర న్యూక్లియర్ ప్లాంట్‌లకు కు చెందిన రహస్య బ్లూప్రింట్లు సంపాదించి పంపించడానికే ఈ నిధులు వెచ్చిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. అఖ్తర్ హుస్సెయిని పేరున ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్ ఉందని, దీని ద్వారానే అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నాయని దర్యాప్తులో కనుగొన్నారు.