మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలు అందించాలని కోరుతూ టీచర్ ఎంఎల్‌సి పింగిలి శ్రీపాల్ రెడ్డి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో గతంలో యుపిఎ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 194 మోడల్ స్కూళ్లలో సుమారు 3 వేల మంది రెగ్యులర్ ఎంప్లాయిస్ ప్రిన్సిపాల్, పిజిటి, టిజిటిలుగా పనిచేస్తున్నారని, ఈ పరిమిత ఉద్యోగుల కోసం ప్రత్యేక సొసైటీ నిర్వహణ రాష్ట్ర ఖజానాపై అదనపు ఆర్థిక భారంగా మారుతోందని శ్రీపాల్‌రెడ్డి చెప్పారు. కాబట్టి, మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేసి 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేసి 010 పద్దు ప్రకటించారని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదు అని,
కాబట్టి ఆర్ధిక శాఖ పరిశీలనలో ఉన్న 010 ఫైల్ త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకొని తగిన ఉత్తర్వులు అందించాలని విన్నవించామని తెలిపారు. అదేవిధంగా ఉపాధ్యాయుల, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల డి.ఎ బకాయిలు వెంటనే విడుదల చేయించాలని కోరారు. డిప్యూటీ సిఎం స్పందిస్తూ యుపిఎ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లు మంచి పురోగతి సాధించాయని, ఇది ఆర్థిక భారం లేని అంశం అయితే కచ్చితంగా నిర్ణయం తీసుకొంటామని శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. దశల వారీ పెండింగ్ బిల్లులు చెల్లింపు వేగవంతం చేస్తామని తెలిపారని అన్నారు. డిప్యూటీ సిఎంను కలిసిన వారిలో ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ ఉన్నారు.