సంతాన భాగ్యం లేదనకుని, 19 ఏండ్లుగా నిరాశ చెందిన దంపతులకు కృత్రిమ మేధ (ఎఐ) ప్రక్రియ వరప్రసాదం అయింది. ఎఐ ఈ విషయంలో గణనీయ సత్ఫలితం సాధించిందని పరిశోధకులు తెలిపారు. అమెరికాలో 39 సంవత్సరాల వ్యక్తి, 37 సంవత్సరాల భార్య పిల్లలు లేకపోవడంతో అనేక రకాలుగా కృత్రిమ గర్భధారణకు ప్రయత్నించారు. ఇన్ విట్రో ఫర్టిలైజెషన్ ఐవిఎఫ్ ప్రక్రియలతో యత్నించారు. కానీ ఫలితం కన్పించలేదు. సాధారణంగా ఇటీవలి కాలంలో ఎక్కువగా మగవారిలో వీర్యకణాల లోపాలతోనే వ్యంధ్యత్వం ఏర్పడుతోంది. శక్తివంతమైన వీర్య కణాలు లేకపోవడంతో వారు తండ్రి కాలేకపోతున్నారని కొలంబియా యూనివర్శిటీ ఫర్టిలిటి సెంటర్ డైరెక్టర్ జెవ్ విలియమ్స్ తెలిపారు. తన పరిశోధనలను ఆయన తాజాగా శాస్త్ర విజ్ఞాన పత్రిక లాన్సెట్‌లో వ్యాసంగా వెలువరించారు.
సాధారణంగా కృత్రిమ గర్భధారణ దశలో తీసుకునే వీర్య నమూనాలలో బయటి నుంచి అంతా సాధారణంగానే ఉంటుంది. కానీ మైక్రోస్కోప్ ద్వారా పరిశీలిస్తే ఇవన్నీ కూడా కేవలం సాధారణ కణజాలాలుగా ఉంటాయి. వీటిలో వీర్య కణాలు కన్పించడం అరుదుగా జరుగుతుంది. స్కలనంలో వీర్యం లేకుండా ఉండే మగవారిలోని అసాధారణ లక్షణాన్ని అజూస్పెరిమియా అంటారు. ఇందులో ఫలదీకరణకు అవసరం అయిన వీర్యకణాలు తక్కువగా లేదా పూర్తిగా లేకుండా పోతాయి. ఈ సమస్యలను అన్నింటిని గుర్తించి పరిశోధకులు అత్యంత శక్తివంతమైన ఇమేజింగ్ టెక్నాలజీతో వీర్య కణాలను గుర్తించవచ్చునని కనుగొన్నారు. ఈ క్రమంలో ఈ పరిశోధక బృందం ఎఐ పరిజ్ఞానం సాయంతో నూతన విధానాన్ని ఆవిష్కరించింది. దీనిని స్పర్మ్ ట్రాకింగ్ అండ్ రికవరీ (స్టార్) పద్ధతిగా వ్యవహరిస్తున్నారు. ఈ స్టార్ ఎఐ పద్ధతితో ఇంతకు ముందటి వరకూ నిరర్థకం అనుకున్న కణజాలంలో ఉండే పనికి వచ్చే వీర్య కణాలను గుర్తించి వీటిని ఒక్కచోటికి చేర్చి మహిళ గర్భం దాల్చేందుకు వీలుగా వీటిని ప్రవేశపెడుతున్నారు.
అయితే ఇది అత్యంత వేగంగా నిర్థిష్టంగా ఏది మంచి ఏది చెత్త వీర్య కణం అనేది గుర్తించాల్సిన నిర్థారణపై ఆధారపడి ఉంటుంది. ఇందుకు ఎఐ ఆధారిత స్టార్ ఎంతగానో ఉపయుక్తం అయిందని పరిశోధకులు తెలిపారు. ఈ దిశలోనే దాదాపు రెండు దశాబ్ధాలుగా సంతానం కోసం తపించిన అమెరికా జంట ఇప్పుడు మమీ డాడీలు కాబోతున్నారు. ఎఐ స్టార్ విధానం రాబోయే రోజుల్లో వీర్య సమస్య ఉండే మగవారి ద్వారా సంతానోత్సత్తికి ఏర్పడే అవరోధాలు తొలిగిపోయ్యేందుకు వీలేర్పడింది. పైగా దీనిని ఓ విధంగా కృత్రిమ గర్భధారణగా కాకుండా అసలైన వీర్యకణాల గుర్తింపుతో సహజమైన గర్భధారణకు దారితీసే పద్ధతిగా పరిశోధకులు పేర్కొంటున్నారు. దీని వల్ల భవిష్యత్తులో సామాజిక దాంపత్యపరమైన సమస్యలకు కూడా తావులేకుండా ఉంటుందని వారు తమ వ్యాసంలో తెలిపారు.