హైదరాబాద్: చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ఆర్టిసి అధికారులు వివరణ ఇచ్చారు. బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ ఆర్టిసి ప్రకటన విడుదల చేసింది. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలినట్లు ఆర్టిసి వెల్లడించింది. రోడ్డు మలుపులో అతి వేగం వల్ల టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని తెలిపింది. ప్రమాదానికి ఆర్టిసి బస్సు కానీ, బస్సు డ్రైవర్ కానీ కారణం కాదని ఆర్టిసి స్పష్టం చేసింది. డ్రైవర్ సర్వీసు రికార్డులోనూ గతంలో యాక్సిడెంట్లు లేవని తేలినట్లు పేర్కొంది.
కాగా, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని ఖానాపూర్- మిర్జాగూడ గేటు సమీపంలో ఆర్‌టిసి బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో 20 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 40 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.