న్యూఢిల్లీ : ప్రభుత్వ, ప్రభుత్వరంగ , ప్రభుత్వేతర సంస్థల పరిసరాల్లో వీధి కుక్కలకు ఆహారం అందించడం వల్ల వచ్చే ముప్పును నివారించేందుకు ఈనెల 7న ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీం కోర్టు సోమవారం వెల్లడించింది. జస్టిస్‌లు విక్రమ్‌నాథ్,సందీప్ మెహతా, ఎన్‌వి అంజారియా తదితరులతో కూడిన ధర్మాసనం ఈమేరకు విచారణ చేపట్టింది. ఈ వీధికుక్కలకు ఉద్యోగులు ఆహారం ఇస్తూ పోషిస్తున్నారని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కోర్టుకు హాజరయ్యారని, వీరు తమ రాష్ట్రాల తరఫున అఫిడవిట్లు దాఖలు చేశారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి వెల్లడించారు.
వ్యక్తిగతంగా ప్రధాన కార్యదర్శులు కోర్టుకు హాజరు కావలసిన అవసరం లేదని, కోర్టు జారీ చేసిన ఆదేశాలను పాటించకపోతేనే హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రధాన కార్యదర్శుల హాజరు, అఫిడవిట్ల సమర్పణ ఎలా ఉన్నా వ్యవస్థాపరమైన ముప్పుపై తాము కొన్ని ఆదేశాలు ఇస్తామని జస్టిస్ విక్రమ్ నాథ్ వెల్లడించారు. ఆదేశాలు జారీ చేసే ముందు వాటిని తమకు వినిపించే అవకాశం కల్పించాలని ఒక న్యాయవాది చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. వ్యవస్థాపరమైన అంశాల్లో ఎలాంటి వాదనలు తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ కేసులో జంతు సంక్షేమ బోర్టును కూడా ప్రతివాదిగా కోర్టు చేర్చింది.