టీం ఇండియా మహిళ క్రికెట్ చరిత్రలో ఆదివారం మరుపురాని సన్నివేశం చోటు చేసుకుంది. దాదాపు నాలుగు దశాబ్ధాల నిరీక్షణకు తెరదించుతూ.. భారత మహిళ జట్టు వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 52 పరుగుల తేడాతో గెలిచిన హర్మన్‌ప్రీత్ సేన.. వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. అయితే ఈ నేపథ్యంలో టీం ఇండియా మహిళ జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బిసిసిఐ ఇప్పటికే మహిళ జట్టుకు భారీ నజరానాను ప్రకటించింది. తాజాగా సూరత్‌కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ ఎంపి గోవింద్ డోలాకియా ప్రపంచకప్ గెలిచిన జట్టు సభ్యులందరికి భారీ కానుకను ప్రకటించారు.
జట్టు సభ్యులందరికీ డైమండ్ నెక్లెస్‌లతో పాటు.. వాళ్ల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లను బహుమతిగా ఇస్తున్నట్లు గోవింద్ తెలిపారు. ఫైనల్ మ్యాచ్‌కి ముందే గోవింద్ బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ రాశారు. అందులో ‘‘ప్రపంచకప్ టోర్నీలో ఇప్పటివరకు భారత మహిళ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. ఒకవేళ మన అమ్మాయిలు ఫైనల్ కప్పు గెలిస్తే.. జట్టులో సభ్యులందరికీ వజ్రాల ఆభరణాలను కానుకగా ఇవ్వాలనుకుంటున్నా. దీంతో పాటు వారందరి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నా. మహిళల క్రికెట్‌లో మన దేశానికి కొత్త వెలుగులు అద్దిన వారి జీవితాలు నిరంతరం వెలగాలని నా ఆకాంక్ష’’ అని పేర్కొన్నారు. అన్నట్లుగానే గోవింద్ తన హామీని నిలబెట్టుకున్నారు. త్వరలోనే వారందరికీ తన తరఫున వజ్రాల ఆభరణాలను, సోలార్ ప్యానెళ్లను అందిస్తానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.