జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దళితులను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని మాజీ మంత్రి,బిఆర్‌ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న దళితులు కాంగ్రెస్ నేతలను ప్రశ్నించాలని కోరారు. రాష్ట్రంలో దళిత ఉద్యమం తీసుకువస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దళితులు బుద్ది చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గరిబీ హఠావో నుంచి నేటి వరకు కాంగ్రెస్ దళితులను మోసం చేస్తోందని, దళితులను ఓటు బ్యాంకుగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళిత వర్గాలను అవమానిస్తోందనిఅన్నారు. రేవంత్ రెడ్డి తీరు దళితులకు వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు.
మల్లిఖార్జున ఖర్గేతో ఎస్‌సి,ఎస్‌టి డిక్లరేషన్‌ను కాంగ్రెస్ విడుదల చేసిందని, దళితులకు ఇచ్చిన హామీలపై సిఎం,డిప్యూటీ సిఎం ఒక్కసారైనా రివ్యూ చేశారా…? అని ప్రశ్నించారు. దళితబంధు 12 లక్షలు ఇస్తామని మోసం చేశారని, ఇందిరమ్మ ఇళ్ళకు 6 లక్షలు దళితులకు ఇస్తామని చెప్పి, ఆ ఇళ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు పరిమితం చేశారని పేర్కొన్నారు. ఎస్‌సి సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళిస్తున్నారని, అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తామని దళితులకు హామీ ఇచ్చారని, ఎస్‌సిలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బందించిందని, అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద సిఎం,మంత్రులు నివాళులు అర్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం అని పేర్కొన్నారు.