హైదరాబాద్: ఎస్ఎల్ బిసి టన్నెల్ పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్ఎల్ బిసి టన్నెల్ పనుల పురోగతిని పరిశీలించామని అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా మన్నేవారి పల్లిలో సిఎం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు టన్నెల్ పనుల అంచనా విలువ రూ. 1968 కోట్లు అని అన్నారు. రెండు దశాబ్దాలుగా సాగుతున్న టన్నెల్ పనుల్లో ఎన్నో అవాంతరాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 30 కిలో మీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తయ్యిందని, మాజీ సిఎం కెసిఆర్ ప్రభుత్వం పదేళ్లలో మిగతా 10 కి.మి. టన్నెల్ పూర్తి చేయలేదని, ఎస్ఎల్ బిసి టన్నెల్ ప్రాజెక్టుల్లో పెద్దగా కమీషన్లు రావని ఈ ప్రాజెక్టు ను పక్కకు పెట్టారని విమర్శించారు. ఎపిలో మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పోతిరెడ్డి పాడును విస్తరిస్తుంటే కెసిఆర్ చూస్తూ ఊరుకున్నారని రేవంత్ మండిపడ్డారు.
రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి నల్గొండ జిల్లాకు నీరు అందేదని, ఈ ప్రాజెక్టు పూర్తయితే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో పట్టించుకోలేదని, కృష్ణా నది పేరు మీద చేపట్టిన అన్ని ప్రాజెక్టులను కెసిఆర్ నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. గత పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు కెసిఆర్ ప్రభుత్వం రూ.1.86 లక్షల కోట్లు చెల్లించిందని, రూ. 1.86 లక్షల కోట్లలో కాళేశ్వరం కాంట్రక్టర్లకే రూ. 1.06 లక్షల కోట్లు చెల్లించారని తెలియజేశారు. గత పదేళ్లలో ఎపి ప్రభుత్వం కృష్ణా నదిపై ఎన్నో ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేసిందని, తెలంగాణలో మాత్రం కెసిఆర్ ప్రభుత్వం కృష్ణానదిపై ప్రాజెక్టులు పూర్తి చేయలేదని అన్నారు. టన్నెల్ బోర్ మిషన్ తో మిగతా పనులు చేయటం కష్టంగా మారిందని, ఎస్ఎల్ బిసి టన్నెల్ పనులపై బిఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయడం తగదు అని హెచ్చరించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ఎస్ఎల్ బిసి టన్నెల్ పనులు పూర్తి చేసి తీరుతామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.