జైపూర్: రాజస్థాన్‌లోని ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం గురించి మరువక ముందే మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ డంపర్ ట్రక్కు డ్రైవర్ జైపూర్‌లోని లోహమండి రోడ్డుపై ఐదు కిలోమీటర్ల మేర బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో రోడ్డుపై పలు వాహనాలను ఢీకొట్టడంతో 19 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనలో మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించామని పోలీసులు పేర్కొన్నారు. మద్యం మత్తులో నియంత్రణ కోల్పోయిన ట్రక్కు డ్రైవర్ దాదాపు ఐదు కిలోమీటర్ల మేర అనేక వాహనాలను ఢీకొంటూ వెళ్లినట్లు తెలిపారు. ఘటన స్థలిలో భద్రతా బలగాలు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై వాహనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.