హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు పెరిగిపోయాయి. అయితే తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. రాజకీయ విమర్శలకు పరిమితులు ఉండలని.. జూబ్లీహిల్స్‌కు పాకిస్థాన్‌తో లింక్ పెట్టడం ఏంటని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాుడతూ.. కాంగ్రెస్ మోసపు పూరిత హామీలతో తెలంగాణలో అధికారంలో వచ్చిందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు అటకెక్కాయని.. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా జూబ్లీహిల్స్‌లో తమ అభ్యర్థిని గెలిపించాలంటూ మంత్రులు ప్రచారం చేయడం సిగ్గు చేటని పేర్కొన్నారు.
ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతే రేషన్ బియ్యం ఆగిపోతుందని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. తాము ఎలాంటి సర్వే చేయకపోయినా.. తమ అభ్యర్థి లంకల దిలీప్ రెడ్డికి అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు. అజహరుద్దీన్‌కి మంత్రి పదవి ఇవ్వడం తమకు రాజకీయంగా ప్లస్ పాయింట్ అయిందని అన్నారు. ఇక నగరంలో మెట్రో విస్తరణకు సంబంధించి ఇప్పటివరకు రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని.. అదే విధంగా ఎల్ అండ్ టి నుంచి ప్రభుత్వం టేకోవర్ చేసిన కొత్త డిపిఆర్ ఇంకా పంపలేదని తెలిపారు.