భారత మహిళ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఐసిసి మహిళా వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. భారత్ ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. మైదానంలో అభిమానుల కేరింతలు మారుమోగిపోయాయి. జట్టులోని ప్రతీ సభ్యురాలు భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఇన్ని సన్నివేశాల ఓ దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. అదే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆమె గురువు అమోల్ ముజుందార్‌కు పాదాభివందనం చేయడం. తన ఈ స్థాయిలో ఉండేందుకు ఓ కారణమైన గురువు అమోల్‌కు హర్మన్ పాదాభివందనం చేస్తున్న దృశ్యాన్ని ఫోటోగ్రాఫర్ క్లిక్‌మనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. హర్మన్ గురుభక్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇక భారత్ కప్ గెలవడంపై అమోల్ ముజుందార్ హర్షం వ్యక్తం చేశారు. మహిళ జట్టు ప్రతి భారతీయుడూ గర్వపడేలా చేసిందని అన్నారు. మహిళ క్రికెట్‌కి ఇది సువర్ణాధ్యాయమని వర్ణించారు. రెండేళ్ల కిందట భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా ఓటములు చవి చూశామని.. వాటి నుంచి పాఠాలు నేర్చుకొని ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నామని తెలిపారు.