చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖానాపూర్- మిర్జాగూడ గేటు సమీపంలో ఆర్‌టిసి బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో 20 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 40 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ఆర్‌టిసి ఎండి నాగిరెడ్డితో మంత్రి పొన్నం మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి పొన్నం ఆదేశించారు. టిప్పర్ రాంగ్ రూట్‌లో వచ్చి బస్సును ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పొన్నం వెల్లడించారు. ఆర్‌టిసి అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లాలని పొన్నం ఆదేశించారు.
ప్రమాణికుల ఆర్తనాదాలో హృదయవిదారఖ వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైపోయింది. సమాచారం తెలుసుకున్న చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ తన సిబ్బందితో హుటా హుటిన సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. జెసిబి, క్రేన్ల సహాయంతో సహాయక చర్యలను చేపట్టారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్న చేవెళ్ల సిఐ భూపాల్ శ్రీధర్ కాళ్లపైకి జెసిబి వెళ్లడంతో సిఐ కూడా గాయపడ్డారు. వెంటనే సిఐని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స నిర్వహించారు. ఈ ఘటనతో బీజాపూర్ హైదరాబాద్ అంతర్ రాష్ట్ర రహదారిపై అటు ఇటు సుమారు ఏడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు మూడు గంటల నుంచి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ ప్రమాదం నుంచి బస్సు కండక్టర్ రాధ సురక్షితంగా బయటపడ్డారు. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.