అసాధారణమైనది, అచంచలమైనది, అసాధ్యమనిపించేది. ఇవే హంగేరీ సాహిత్య శిఖరం లాస్లో క్రాస్నహోర్కై సృష్టించిన కళాఖండాలను నిర్వచించే పదాలు. 2025లో ఆయనకు లభించి న నోబెల్ పురస్కారం కేవలం ఒక గౌరవం కాదు, సాహిత్య నియమాలను ఉల్లంఘిస్తూ, తనదైన మార్గాన్ని చెక్కుకున్న ఒక ఏకాకి తత్వవేత్తకు దక్కిన పట్టాభిషేకం. సంప్రదాయపు సరిహద్దుల ను ఛేదించి, మానవ ఉనికి తాలూకా లోతైన చీక టి కోణాలను ఆవిష్కరించిన ఒక తపస్వికి దక్కిన సముచిత గౌరవం. సాహితీ స్రవంతిలో నూతన ఒరవడిని సృష్టించిన లాస్లో క్రాస్నహోర్కై రచనలు కేవలం గ్రంథాలు కావు.
ఆయన సాహిత్యాన్ని మిగిలిన వారి నుండి వేరు చేసే, దానికి అనిర్వచనీయమైన వైభవాన్ని అం దించే ప్రత్యేకతలు రెండు ధ్రువాల మాదిరిగా ఉన్నాయి. ఒకటి గద్య శిల్పం, మరొకటి తాత్విక దృక్పథం.
అఖండ వాక్య శిల్పం-కాలగమనపు
నిరంతర ప్రవాహం:
క్రాస్నహోర్కై గద్యం మన తెలుగు సాహిత్యంలోని చంపకమాల వలె, ఒక నిర్దిష్టమైన లయబద్ధమైన దార్శనికతను కలిగి ఉంటుంది. సాధారణంగా రచయితలు వాక్యాన్ని పూర్తి విరామంతో ఆపి పాఠకుడికి విశ్రాంతిని ఇస్తారు. కానీ క్రాస్నహోర్కై రచనలలో వాక్యం అ ఖండమైన ప్రవాహం లాగా పేజీల కొద్దీ సాగుతుంది. ఇది కేవలం శైలి విన్యాసం కాదు. ఇది జీవిత సత్యాన్ని ప్రతిబింబిస్తుంది. మన ఆలోచనలు, ఆందోళనలు, భయాలు ఏనాటికీ ఒక ‘చుక్క’తో ఆగిపోవు అని అవి ఒక నిరంతర ఊపిరిలా సాగుతూనే ఉంటాయని తెలియజేస్తాయి. ఆ ఊపిరిని ఆయన తన వాక్యాలలో బంధించారు. ఆయన గద్యం శబ్ద తరంగం వలే పాఠకుడిని చుట్టుముడుతుంది. ఈ నిరంత ర వాక్య నిర్మాణం, ఆవేశం, నిరీక్షణ అనే భావాలను పాఠకుడికి బలంగా అనుభూతినిస్తుంది. పాఠకుడు తన ఇష్టానికి కాకుండా, రచయిత నిర్దేశించిన ఆ విపరీతమైన లయకు లొంగిపోక తప్పదు.
తాత్విక సారస్యము-చీకటిలో వెలుగు రేఖ:
ఆయన రచనల్లోని నేపథ్యం ప్రళయ చీకటిలో కప్పి ఉన్నప్పటికీ, దాని అంతర్లీన సందేశం చీకటిని దాటే ప్రయత్నం లాంటిది. ఆయన కథాంశాలు ముఖ్యంగా సాటాన్టాంజో వంటివి. నైతిక వ్యవస్థలు కూలిపోతున్న ఒక ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాయి. ఇక్కడ ప్రళయం అనేది బాహ్య విస్ఫోటనం కాదు. అంతర్గత క్షీణత. మానవుని ఆత్మ లో, సమాజపు కట్టుబాట్లలో సంభవించే నెమ్మదై న, అనివార్యమైన విచ్ఛిన్నం. క్రాస్నహోర్కైతత్వం పరాకాష్ఠ ఇక్కడే ఉంది. దారుణమైన నిరాశ మధ్యలో కూడా సౌందర్యాన్ని ఆవిష్కరించడం. ఆయన తరువాతి రచనల్లో, జపాన్ కళ, బౌద్ధ తత్వపు ప్రభావంతో అశాశ్వతమైన లోకంలో కళా శక్తిని, ఒక నృత్యాభినయంలోని క్షణిక పరిపూర్ణతను ఆయన ఆవిష్కరించారు. మధ్య యూ రని కాఫ్కా వంటి తత్వవేత్తల అసంగత హాస్యం, బెర్న్హార్డ్ వంటివారి తీవ్ర విమర్శనాత్మక ధోరణిని స్వీకరిస్తూనే, దానికి ప్రాచ్య తత్వపు ప్రశాంతతను జోడించి, ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన విశ్వజనీన దృక్పథాన్ని సృష్టించారు.
లాస్లో క్రాస్నహోర్కై సాహిత్యం నియమాలను పాటించే వారికి కాదు. అది సత్యాన్ని శోధించే వారికి. ఆ ఒక్క అఖండ వాక్యం వెనుక, ఒక యు గం క్షీణత, ఒక ఆత్మ అలజడి, వాటి మధ్య ఎక్కడో దాగి ఉన్న కళ యొక్క దివ్యశక్తి దాగి ఉన్నాయి. అందుకే ఆయన రచనలు, ఒక నిత్య సత్యాన్ని చాటి చెప్పే మౌన విపంచిగా నిలిచాయి.
– విర్గో