హోబార్ట్: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా బెల్లెరివ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టి-20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. వాషింగ్టన్ సుందర్ అదిరిపోయే బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని భారత్ 9 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. తొలి వికెట్‌గా 25 పరుగులు చేసి అభిషేక్ ఔట్ కాగా.. శుభ్‌మాన్ గిల్ 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(24), తిలక్ వర్మ (29) ఫర్వాలేదనిపించారు. కానీ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ మాత్రం ఈ మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. కేవలం 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక జితేష్ శర్మ 22 పరుగులు చేసి నాటౌట్‌గా ఉండగా.. అక్షర్ పటేల్ 17 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ బౌలింగ్‌లో ఎల్లీస్ 3, స్టోయినస్, బార్ట్‌లెట్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో సిరీస్ 1-1 తేడాతో సమం అయింది.